పుట:హరివంశము.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

502

హరివంశము

క. కోపించి హయగ్రీవుఁడు, చాపముఁ గేతువును నఱకి సారథి హరులన్
     వే పడనేసిన విరథుం, డై పఱచెం బూషుఁ డాసురావళి యార్వన్.87
వ. శంబరుండును ద్వాదశారత్నిదైర్ఘ్యప్రచండం బగుకోదండంబున నక్షదండప్రమా
     ణంబు లగుబాణంబులు భగునిమీఁద నిగుడించె నతండును విశ్వకర్మనిర్మితం
     బగు కార్ముకంబున నిరుక్తంబు లయిన రిపుసత్త్వాపహసాయకంబుల నయ్యసుర
     వరుశరీరం బంతయుం గప్పె వారిరువురుఁ బరస్పరశరనికరవిదళితాంగు లై చైత్ర
     సమయకుసుమితంబు లగుకింశుకంబులకుం బాటి యగుచు నెత్తుటం దోఁగి
     మగంటిమి నొండొరులకు వట్రపడక పోరుచుండ నప్రమేయం బగుమాయ నెక్కు
     డగుదైతేయుండు మాయ గావింపం దొడంగి.88
క. హరులఁ బరిమార్చి సారథిఁ, బొరిగొని కేతనము నఱకి భూరిశరంబుల్
     వరపి పరిపంథి దేహం, బరవ్రేలెఁడు తెఱపి లేనియట్లుగఁ జేసెన్.89
వ. అనంతరంబ యదృశ్యుం డై యాకసంబున నార్చి క్రమ్మఱ దృశ్యమూర్తి యై
     మహీతలంబున నిలిచి పెలుచం బగతుబాణంబుల చేత నచేతనుం డైన యట్ల
     కొంతవడి యుండి యంతన తెలిసి యైరావణారూఢుం డైన దివిజపతి తెఱంగునం
     దోఁచి యాలోనన పర్వతప్రమాణఘోరంబు లగుశరీరంబులు నూఱు దాల్చి
     యెల్లదెసలు దానయై పొడసూపి యుడిగి ప్రాదేశమాత్రం బగుగాత్రంబున
     నుజ్జ్వలుం డై యెగసి జలధరంబు చందంబున నుదారంబు లగునాకారంబు లనే
     కంబులు గైకొని తిర్యగూర్ధ్వసంచారంబుల గర్జిల్లి విలయకాలంపువానపగిదిం
     గురిసి యవ్విధంబు మాని సంవర్తవైశ్వానరు పడువున బెడిదంపుమంటలం బేర్చి
     యేర్చి శతమస్తకుండును శతోదరుండును శతసహస్రబాహుండును నై పోరి
     యెదిరి సేనలవలనం జనుదెంచు శస్త్రాస్త్రపరంపర లెల్లను మ్రింగుచుం దనకుం
     దగినయట్టి మహారథం బెక్కి వివిధాయుధంబుల యుద్ధంబు గంధర్వనగరంబు
     పగిది నక్కడన యంతర్ధానంబు నొంది యాత్మీయరూపంబున నెప్పటి యరదంబు
     పయిం గానఁబడి విరోధి నతినిరోధి శరనికరంబులం బొదివిన.90
క. అతఁడు వెఱచఱచి లజ్జయు, ధృతియును బోవిడిచి పఱచి దేవేంద్రుని ను
     న్నతశౌర్యుఁ జేరి యొదిఁగెను, దితిసుతసైన్యంబు లార్వ దెస లద్రువంగన్.91

శరభశలభు లను దైత్యులు సూర్యచంద్రులతో మహాయుద్ధంబు చేయుట

వ. శరభశలభు లను దైత్యు లత్యుగ్రసాయకంబుల సూర్యశశాంకుల శరీరంబులు
     నించినం గోపించి యందుఁ జందురుండు.92
క. ఆయిరువురకాయంబులు, నాయతహిమరూపదారుణాస్త్రంబులపె
     ల్లై యుడిగి పడఁగఁజేసి య, జేయుండై కవిసె దైత్యసేనలమీఁదన్.93