పుట:హరివంశము.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

496

హరివంశము

తే. రజతశైలంబపోలె నాత్మజులు మనుమ, లాత్మసము లెందఱైన నెయ్యమునఁగొలువ
     వెడలెఁ గశ్యపసుతుఁ డైనవిప్రచిత్తి, చిత్త ముత్సాహరసమునఁ జెన్ను మిగుల.36
తే. కేశి యేఁబదిరెండువేలాశుగతము, లగురథంబులతోడ నుష్ట్రాంక మైన
     పడగ గలతేరిపైఁ బెద్దబారివిల్లు, చేత నొప్పగ నేగె నాజికి రయమున.37
క. వృషపర్వుండు గర్వంబున, వృషపూర్వకు లైనసకలవిద్విషులదెసన్
     విష మొలుకుకినుక నరిగెను, వృషభధ్వజరథముమీఁద విషమాక్షుక్రియన్.38
వ. మఱియు సుపార్శ్వుండు నుల్కాంబకుండును కుంభాండుండు మొదలుగా
     నసంఖ్యేయు లగుదైతేయు లప్రమేయసేనాసమేతంబుగా నాముక్తకవచులును
     నాత్తకిరీటులు నాగృహీతవివిధాయుధులు నారూఢవిక్రమప్రయత్నులు నాబద్ధ
     సమరపరికరులు నై వెడలునెడ బలీంద్రుండు చంద్రాంశుధవళదుకూలవాసస్సు
     గంధికుసుమదామసురభిగంధబంధురాభరణంబుల నలంకృతుం డై వీర్యవంతంబు
     లగుమంత్రంబుల నౌషధంబుల నుపబృంహితంబును బహువిజృంభణంబును
     నగునైజతేజంబునం బొదలి బ్రాహ్మణోత్తములకు నుత్తమంబు లగువిత్తంబుల
     రాసులు గోభూమీప్రముఖంబులుం బ్రియభక్తిపూర్వకంబుగాఁ బ్రతిపాదించి
     తదాశీర్వాదసహస్రంబు నభివర్ధితుం డై రిపుపరాజయత్వరితం బగు మనంబు
     తోడ ననల్పవిస్తీర్ణంబును సౌవర్ణవృకధ్వజవిరాజితంబును నగు విశ్వకర్మ
     నిర్మితమాణిక్యస్యందనం బధిరోహించి రోహణాచలస్థితం లైన మహామేఘంబు
     మహేంద్రచాపంబునం బొలుచు కరణి వివిధమణికిరణవ్యతికరస్ఫురితం బగు
     శరాసనంబు ధరియించి నిఖిలదిగంతరవ్యాప్తం బగు తూర్యఘోషంబునం బెరసి
     వందిమాగధ జయజయశబ్దంబులు బహువీరబిరుదాలాపంబులు నాటోపంబు
     నుద్దీపితంబు సేయఁ గదలె హయశిరుండు నశ్వశిరుండు శతాక్షుండు జంభుండు
     కుపథుండు శిఖిమతంగుండు కిరాతుండు దురాపుండు నికుంభుండు హరుండు
     నను దానవులు పదుండ్రు తదీయరక్షకు లై కదిసి నడిచి రివ్విధంబున.39
క. బలిఁ బ్రభుఁగా మున్నిడుకొని, బలియురు బలుఁడాది యైనప్రత్యర్థు లనా
     కులరభసంబునఁ దమపైఁ, జలమునఁ జనుదెంచువిధము శక్రుఁడు వినియెన్.40
తే. విని సమస్తదేవతల రావించి యంత, యును నెఱింగించి శత్రులయుద్యమమున
     కుచితమైనట్టిప్రతికార మోపి చేయ, కునికి యైశ్వర్యకాంక్షికిఁ జనునె యెందు.41
వ. కావున నెదురు నడిచి పొడిచి గెలుతుము లెండు సన్నద్ధు లై రం డని పనిచి. 42

ఇంద్రుండు సకలదేవతలతోడ బలితోడి యుద్ధమునకు వెడలుట

శా. వీరోల్లాసము హాసవిభ్రమముగా వేగంబ కైసేసి యిం
     పారన్ వేల్పులు వేల్పుభామలును రాగారూఢత న్మెచ్చఁగా