పుట:హరివంశము.pdf/531

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 9.

483

మ. ఘనసంధ్యారుణతుంగదేహుఁడు పిశంగశ్మశ్రుకేశుండు దీ
     వ్రనిశాతోత్కటదంష్ట్రుఁ డుగ్రపరిఘవ్యాదీర్ఘదీవ్యద్భుజుం
     డనిరోధాయుధయోగదీప్తుడు హిరణ్యాక్షుండు దుర్వీక్ష్యభా
     వనిరూఢిన్ రిపుకోటి మార్కొనియె సంవర్తాంతకాకారుఁడై.183
క. స్వామిసముత్సాహంబున, నేమియు నరవాయి గొనక యిరువాఁగును ను
     ద్ధామసమరం బొనర్పఁగ, నామెయి భూతములకెల్ల నద్భుత మయ్యెన్.184
వ. అందు.185
మ. క్షతులై పాతితులై విధూతు లయి ర కస్యందిసందిగ్ధజీ
     వితసమ్మూర్ఛితచేష్టులై విరథులై వీతాశ్వులై వారుణ
     చ్యుతులై పాటితహేతులై విశిఖసంక్షుణ్ణాంగులై నిర్జరుల్
     ధృతి దూలంగఁ దొలంగి రెల్లెడల దైతేయాహవాభీలతన్.186
వ. హిరణ్యాక్షుండును సహస్రాక్షుం దలపడి యప్రమేయప్రమేయవిశిఖపాశంబుల నై
     రావణసమేతంబు ప్రతిబద్ధదేహుం జేసిన గదల నేరక యూరక నిష్ప్రతీకారుం డై
     యతం డుండె నంత నిలువక మఱియును.187
తే. అనిమిషుల నెల్లఁ బోనీక యాఁగి యున్న, వాని నున్నచోఁ గట్టి దుర్వారదైత్యుఁ
     డార్చె సంహారసమయసప్తార్చి నార్చు, కాలమేఘంబు గర్జిల్లు లీలఁ జెలఁగి.188
వ. ఇవ్విధంబున నఖిలవిబుధులు దిక్కు లేక చిక్కిన విధంబును విబుధవైరి యొక్కరుం
     డుక్కుమిగిలి మగఁటిమి సుక్కివుం డై పేర్చిన భంగియుం దన చిత్తంబున నవధ
     రించి యాశ్రితాభయప్రదానవిదగ్ధుండును గేవలకరుణాముగ్ధుండును సర్వ
     భూతచిత్రజ్ఞుండును బ్రవర్తితాఖలయజ్ఞుండును నగు యజ్ఞపురుషుండు యజ్ఞ
     వరాహదేహం బవ్యాహతబాహులలితంబును బ్రభూతదివ్యాయుధకలితం
     బునుం గా నుద్వహించి.189
క. చనుదెంచి పాంచజన్య, స్వనమున దానవులహృదయసంపుటభేదం
     బొనరించుచుఁ దనునీలిమ, పెనుఁజీఁకటి గదిసి రిపులు బెగ్గిలి కలఁగన్.190
క. సితశంఖదీప్తచక్ర, ద్వితయావిర్భూతిఁ బొలిచె దేవోత్తముమే
     నతులితశశిరవిబింబ, ప్రతిబద్ధం బైనమేచకాభ్రముఁ బోలెన్.191
వ. అమ్మహామూర్తి నాలోకించి యాలోకవిద్వేషులు వెఱుఁగుపాటున హృదయం
     బులు గలంగఁ దమలోన.192
చ. అమరులఁ గావఁ బూని వికృతాకృతియై యిట వచ్చినాఁ డితం
     డమితబలుండు నాఁబరఁగు నమ్మధుకై టభశత్రుఁ డింక నే
     క్రమమున నైన నీ వతని ఖండితగర్వునిఁ జేయు మంతలో
     సమయు నిలింపకోటికిని సర్వముఁ జేకుఱు నస్మదీయ మై.193