పుట:హరివంశము.pdf/522

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

474

హరివంశము

     గర్తయుఁ గరణంబుఁ గార్యంబుఁ బురుషుండుఁ బ్రకృతియు బుద్ధియుఁ బ్రాణచయముఁ
     గాలంబుఁ గళయు వక్తయును వక్తవ్యంబు వాక్కును ననుబహుత్వంబు లెల్లఁ
తే. దానయై నిత్యుఁ డమృతుఁ డద్వంద్వుఁ డజరుఁ, డప్రమేయుఁ డనాద్యంతుఁ డజుఁ డనంగఁ
     బరఁగు విష్ణుండు విశ్వైకభర్త నిఖిల, మునకు నొక్కండ సంహర్త పుణ్యయశుఁడు.100
వ. కృతత్రేతాద్వాపరకలినామంబు లగు నాలుగుయుగంబులుం బండ్రెండువేలదివ్యా
     బ్దంబులం బర్యవసితంబు లగు నట్టిచతుర్యుగంబులును డెబ్బదియొక్కమాటు
     దిరుగ మన్వంతరం బగు నట్టిమన్వంతరంబులు పదునాలుగు ససంధికంబులయి
     చనుట సహస్రయుగపరిమితం బైన బ్రహ్మదివసం బాదివసంబుకడపలం బరమపురు
     షుండు సప్తమూర్తి యగుమార్తాండుం డై సర్వప్రాణిజాతంబును భస్మీకరించి
     యాత్మోద్భవం బగుదివ్యసలిలంబున నఖిలంబును నాప్లావితంబు చేసి యేకార్ణవ
     సంజ్ఞం బైన యమ్మహాజలౌఘంబున నద్భుతాకారుం డై పవ్వళించియుండు.101
మ. విను మమ్మైఁ బవళించి యున్నవిభుఁ డీవేషంబువాఁ డిట్టివాఁ
     డనఁగా నింత తదీయసుప్తిదశ కర్హం బైన కాలంబు మే
     ల్కను చందం బిది నా నెఱుంగఁ డొకఁడుం గాలంబు కర్మంబు నా
     తనికిం గీడ్వడియుండుఁ గావున నంచిత్యంబుల్ తదాకారముల్.102

జనమేజయునకు వైశంపాయనుఁడు మార్కండేయచరిత్రంబు చెప్పుట

వ. మఱియు నొక్కయాశ్చర్యంబు గలదు మార్కండేయుం డను తపస్వి యమ్మహా
     ప్రళయసమయంబున నమ్మహామూర్తిం గని తత్సంభాషణసౌహార్ధం బనుభవించి
     కృతార్థుం డయ్యె నవ్విధం బతనివలన వినినవారెల్లను నెఱుఁగుదురు తత్ప్ర
     కారంబు విను మమ్మునివరుం డద్దేవుని యుదరాభ్యంతరంబున లబ్ధసన్నివేశుం
     డగుచు భువనప్రపంచంబునందుఁ దీర్ధయాత్రాప్రసంగంబునం బృథివిగలయంతయుం
     బరిభ్రమించుచుఁ గ్రమంబునం జనుదెంచి తదీయవదనమార్గంబున వెలువడియె
     నయ్యది యెయ్యదియు యొండుం దా నెఱుంగండు పరవశుండపోలె నట్లు వెలు
     వడి యమ్మహాతిమిరసంహృతం బైన యమ్మహాప్రళయసలిలంబు సొచ్చి.103
ఆ. తల్లడంబు నొంది తనజీవితమునందుఁ, గరము సంశయించి కలయొ భ్రమయొ
     మాయయో తలంప నీ యుగ్రదశ నిజం, బగునె యెందు నిట్టి యద్భుతంబు.104
చ. తరులు గిరుల్ నరుల్ సురలు దైత్యులు పక్షులు లోనుగాఁ జరా
     చరతతి చూడఁజూడ నవసన్నత నెం దడఁగెం దమంబు ని
     ర్భరమయి యిమ్మెయిం బొదలె భాస్కరచంద్రవిభాస మెచ్చటన్
     సురిఁగె మహాజలం బఖిలశూన్యతఁ బేర్చుట యేమి చందమో.105
వ. అని తలంచుచు నటఁ జూచునప్పు డెదుర నుదకమధ్యంబునం గాలాంజనపర్వతం
     బునుంబోలె నతిప్రమాణం బగుదేహంబుతోడం దన తేజంబ తన్ను వెలయింపం