పుట:హరివంశము.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350

హరివంశము

     క్షావిధి నున్నాఁడం గ్రియ, యేవిధమో యనువిచార మంతయుఁ బొడమెన్.62
వ. ఏమి సేయుదు నని చింతించునమ్మహాత్మునితో నేను సవినయంబుగ.63
క. ననుఁ బంపుము భూమిసురేం, ద్రునియాపద యపనయించి రూఢిగ నీనే
     మ్మనమునకు సంప్రమోదం, బొనరించెద నంటి ననిన నొయ్యన నగుచున్.64
వ. అద్దేవుండు నీకు నిప్పని యొనర్ప శక్యంబె యనుటయు నొక్కింతసిగ్గునం దల
     వాంచినం జూచి యైన నేమి యొక్కొండవ చనవలవదు రామప్రద్యుమ్నులు
     దక్కఁ దక్కినయదువీరుల సాత్యకి మొదలుగాఁ దోడ్కొని సైన్యంబుల గొని
     చను మని వీడ్కొలిపిన.65

అర్జునుఁడు బ్రాహ్మణకుమారుని రక్షింపఁబోవుట

మహాస్రగ్ధర. గజవాజిస్యందనౌఘోత్కటసుభటసమగ్రస్ఫురద్భూరిఘోర
     ధ్వజినీసన్నాహ మొప్పం దరతరమ మహాధన్యులై యోధు లిద్ధ
     ధ్వజరాజీరమ్యలీలల్ దనర నకువ నుద్యద్రథస్థుండనై యా
     ద్విజవంశేశుండు మున్నై తెరువిడఁ జనితిం దీవ్రయానోగ్రభంగిన్.66
వ. ఇ ట్లరిగి తదీయగ్రామంబు నేరి తన్మధ్యంబున నఖిలయదువీరసమేతంబుగా విడిసి
     సైన్యంబుల నూరిచుట్టును విడియించి యందఱమును విశ్రాంతవాహనులమై
     యున్నంత.67
చ. ఖరకరుఁ డున్నదిక్కున సృగాలఖగావలి రూక్షఘోర[1]దు
     స్తరముగఁ గూయఁ జొచ్చె ఘనసంధ్య యకాలమునం దలిర్చె నం
     బరమున భానుఁ డెంతయుఁ బ్రభారహితత్వము నొందె నుల్క భీ
     కరముగ మ్రోయుచుం బడియె గాఢపరాభవభంగిఁ దెల్పుచున్.68
క. అంతయుఁ గనుఁగొని యే మ, త్యంతసముత్సాహ మమర నాయితపడి యు
     న్నంత ధరణీసురోత్తమ, కాంతకు నయ్యెం బ్రసూతికాలం బనఘా.69
వ. అతండును మా కవ్విధం బెఱింగించె దదీయసూతికాసదనంబు మహారథులు
     సజ్యశరాసను లై రక్షించి రట నర్ధరాత్రసమయంబున.70
సీ. బ్రాహ్మణికడుపులోపలనుండి వెలువడినప్పుడ చెలఁగి యందంద యేడ్చు
     బాలకు నేడ్పు లేర్పడ వింటి మంతన పొరిఁబొరి నదె పోయెఁ బోయెఁ జెడితి
     మనుచు నాక్రందించునంగనాజనులయార్తధ్వను లొకట నుద్గతము లయ్యె
     నాలోన వీ తెంచె నర్భకురుదితంబు పలుమాఱు మఱియు నంబరతలమున
తే. నేను మొదలుగ నొండొండ యొసఁగునంప [2]వెల్లివఱపితి మావియద్వీథి కలయఁ
     గాన మొక్కని నెందుఁదాఁకదు దగులదు, ఱిచ్చవడి నిల్చితిమి వెఱ ముచ్చముడిఁగి.71
క. ముదుసళ్లు[3]ను ముత్తవ్వలు, మొదలుగ మముఁ బెక్కుచందముల మర్మంబుల్
     గదలఁగఁ బొడిచిరి మాటలఁ, బదపడి చనుదెంచి రోషపరుషాకృతి యై.72

  1. విస్వరముల
  2. నెల్లి వఱసియు వస్త్రముల్ వెలయఁజేసి
  3. మంతనంబులు