పుట:హరివంశము.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

హరివంశము

వ. అచ్చట నమరపతివలన నహితుని నగరంబు దురధిగమత్వంబును దచ్చమూసమూ
     హంబుల సన్నాహంబును సమ్యగ్భంగి నెరింగి తదీయ[1]విదళనవ్యవసాయంబునకు
     ననాయాసంబు లగు నాలాపంబులు విని సపరిజనంబుగా నతని వీడ్కొలిపి
     యద్భుతాటోపదీపితుం డై కదియ నడచి.129
మ. స్ఫురదుద్దామరథాశ్వకుంజరభటస్తోమప్రభాస్వచ్చమూ
     దురధిక్షేపము లైన సన్నహనముల్ తోరంబు లై యొప్పఁగా
     నరకావాసము గాచియున్న ఘనులన్ దైతేయులం దాఁకెఁ బ
     ల్వురఁ జెండాడె నఖండకాండవిసరవ్యుచ్ఛేదనక్రీడలన్.130
వ. తదనంతరంబ.131
సీ. మురదైత్యుచేత నుధ్ధురనిజమాయాబలంబునఁ బ్రాగ్జ్యోతిషంబుచుట్టు
     నొడ్డంగఁబడి నిశితోగ్రనిరంతరగురుముఖంబులు గల్గి సురభుజంగ
     గరుడగంధర్వాదు లొరసినఁ బేర్చు విస్ఫారపాశంబులు బహుసహస్ర
     సంఖ్యంబు లొరుల కసాధ్యంబు లాతఁడు గావించినవి తీవ్రకఠినచక్ర
తే. ధార నన్నియుఁ దునిమి యాదైత్యుఁ దొడరి, చటులశార్ఙ్గవినిర్ముక్తశరచయములఁ
     బొదివె త్రిదశారియును నీడఁబోక సింహ, నాద మఖిలనభోభేదనముగ నెదిరి.132
క. బలితపుగద గరుడునినడు, తల వ్రేసి కడంగి పటుగదాళూలసము
     జ్జ్వలశక్తిపరశుతోమర, ము లనేకము లతనిమీఁదఁ బొరిఁ దొఱఁగించెన్.133

శ్రీకృష్ణునిచేత మురాసురుఁడు మొదలైన మహారాక్షసవీరులు చంపఁబడుట

మ. కినుకం గెంపు గనుంగవం గదురఁగాఁ గృష్ణుండు గృష్ణోరగం
     బున కత్యుగ్రఫణంబు పేర్చినక్రియం [2]బొల్పొందు తీవ్రక్షుర
     ప్రనిశాతాస్త్రము కార్ముకంబునఁ గఠోరస్ఫూర్తి సంధించి యీ
     సున నేసెన్ రిపుమస్తకంబు మకుటాంశుల్ పర్వి యుర్విం బడన్.134
వ. ఇట్లు మురాసురుం బరిమార్చి కృష్ణుండు మర్దితరిపుదైన్యం బగు పాంచజన్యంబు
     పూరించినం దదారావంబు ద్రైలోక్యరంధ్రబాధాకరం బై పరఁగుటయు.135
మ. జలధుల్ పిండలివండుగాఁ గలఁగె నాశావారణశ్రేణి బె
     గ్గిలి మ్రొగ్గంబడియెం [3]జరాచరచయక్లేశోత్తరం బై ధరా
     వలయం బంతయు గ్రక్కునం గదలె [4]గీర్వాణావళుల్ సాధ్వసా
     కులమయ్యెన్ హరపంకజాసనులు ప్రక్షోభించి రంతర్గతిన్.136
వ. అతని నెదిర్చి నిసుందుండు బృందారకద్విరదభిదాచండం బగు గదాదండం
     బమర్చి పేర్చి తద్వక్షంబు వ్రేసి శార్ఙ్గచ్యుతంబు లై కవియు సాయకంబు లందంద

  1. విఫలన
  2. బొందొందు
  3. జెలంగి కలకన్
  4. గీర్వాణాదులున్