పుట:హరివంశము.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 4.

325

శా. విక్రాంతిం ద్రిజగంబులందును గడున్ విఖ్యాతుఁ డుద్దామని
     ర్వక్రస్వైరజవంబునన్ బవనునిన్ భంజించు పక్షిప్రభుం
     డక్రూరాతుఁడు వీఁ డనన్ నెగడువాఁ డబ్జాక్ష యుద్యన్మహా
     చక్రుం దాల్పఁగలండు శాత్రవవధేచ్ఛం జేయు కయ్యంబులన్.122
వ. అని పలికి తనతోడన చనుదెంచి వినయావనతుం డగు వినతాతనయుం జూపి
     యింద్రుండు మఱియును.123
మ. మును నీమెచ్చినవాహనంబ యిపుడు న్మోదంబుతోఁ జేరె గ్ర
     క్కున నారూఢుఁడవై జగంబులకుఁ జక్షుఃప్రీతి గావించుచుం
     జని [1]వే కౌశల ముల్లసిల్ల జయప్రస్థానంబునుం జేయుమా
     వనజాతేక్షణ యీక్షణంబ తగ సర్వంబున్ సుసిద్ధంబుగన్.124
వ. అయ్యసుర యున్న ప్రాగ్జ్యోతిషపురంబున కేఁగ దెరువు వెట్టెద విజయం చేయు
     మనుడు నద్దేవుండు దేవేంద్రుం జూచి యిత్తెఱంగు మున్న యెఱుంగుదు
     నె ట్లనిన బదరీవననివాసు లగు తాపసపుంగవు లేతెంచి దైతేయుచేతఁ దమ
     పడినపాట్లుం జెప్పి దివిజుల కజేయుం డని నాకును ప్రోద్బలకారి యగు నుపదేశం
     బొనర్చి పోయిరి తదనంతరంబ నీవును వచ్చితి నాకడంకకు సహ కారంబు వాటించి
     తిది యెంతయు లెస్స నీతోడఁ జనుదెంచెదఁ బోద మని గద్దియ డిగ్గి యదువృద్ధుల
     వీడుకొని యాయితం బైన చక్రశార్ఙ్గాదిసాధనంబులు గైకొని సత్యభామ
     రావించి తత్సహితుం డై గరుడస్కంధారోహణంబు సేసి.125
మ. గురుబంధుద్విజకోటిదీవనలు ప్రక్షుభ్యన్నభోభంగి బం
     ధురతూర్యధ్వనులున్ సమస్తసుమనస్తోత్రప్రణామంబులున్
     వరవైతాళికవందిబృందజయజీవస్ఫారశబ్దంబులున్
     [2]వెరవై పేర్చి చెలంగ వెల్వడియె సంప్రీతి న్నిజావాసమున్.126
వ. ఇట్లు పురుహూతుం బురోయాయిం జేసి పురంబు నిర్గమించి మహీమార్గంబునఁ
     గొంతదవ్వు చని రంతనుండి యంబరమార్గంబునఁ గృష్ణజిష్ణు లిద్దఱు నుద్దామంబు
     లభిరామంబు లై వెలయ నేకముఖంబున నడచు శీతకిరణతీవ్రమయూఖరేఖ
     లలమికొనఁ దేజరిల్లి రంత.127
మ. పవనస్కంధము లేడిటం బటుకళాపర్యాప్తపర్యాయ[3]సి
     ధ్రవిచిత్రక్రమణం బొనర్చుచు లసద్వైమానికస్థానముల్
     వివిధాలోకనకౌతుకంబు వెలయ న్వీక్షించుచున్ వృష్ణిసం
     భవుఁ డొందెన్ సురసంచయంబు లలరన్ బ్రాగ్జ్యోతిషప్రాంతమున్.128

  1. పైఁ గౌతుక
  2. బెరపై
  3. నవ్య