పుట:హరివంశము.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

హరివంశము

     ప్రణిథానంబులు భక్తితోడ నొనరింపం గల్గెఁగా కొండ ని
     ర్గుణ యెవ్వారు నెఱుంగ నోపుదురె [1]నీరూపంబు నీరూపమున్.93
తే. అక్షరత్రయాత్మక మగు నప్రమేయ, వర్ణమునకు నీ తత్త్వంబ వాచ్యపదము
     ఋగ్యజుస్సామములు నీకు నెల్లనాఁడు, దేవదేవ సమీహితస్థాపకములు.94
క. క్రతుమూర్తివి క్రతుకర్తవు, క్రతుఫలయోగాత్మకుఁడవు క్రతురిపుహనన
     వ్రతధరుఁడవు క్రతుపతి వీ, వతులదయోపేతహృదయ యంభోధిశయా.95
ఉ. నీకొనరించు పూజలు మనీషితసిద్ధివిధాయినుల్ సము
     ల్లోక[2]విధావిదాశయలు లోకయుగస్థితిదాయినుల్ గుణా
     త్సేకసమగ్ర లట్లగుటఁ జేసి భవత్ప్రియభక్తు లూర్జిత
     శ్రీకులు వీకశోకులు గరిష్ఠవివేకులు దైత్యమర్దనా!96
వ. అని మహామునులు మహనీయవాక్యంబులఁ త్రైలోక్యపూజ్యు నతనిం బూజించి
     వినతు లై యుండ నఖిలయాదవులును సాత్యకి పురస్సరంబుగా సముత్థితు లై
     మోడ్పుచేతులు నౌదలలం గదియించి దేవా ప్రసన్నుండ వగుము ని న్నెఱింగి
     తెలుప నింత లీ మహానుభావు లెఱుంగనేర కున్నవార లే మెవ్వారము
     వాత్సల్యం బొక్కటియ కారణంబుగాఁ గారుణ్యంబుతో భవదీయాశ్రయుల
     మమ్ము నాలోకించి కైకొను మని యభ్యర్థించిన నాదరించి వాసుదేవుం డమ్మహీ
     దేవోత్తముల నాలోకించి.97
శా. పాపాత్ముం డగు దైత్యుచేఁ బడిన మీపాటంతయుం జెప్పఁగాఁ
     గోపం బుత్కట మై మనంబునకు సంక్షోభంబు ప్రాపించె మ
     ద్రూపం బొండొకభంగి మీకు నిటు లై తోఁచెన్ భవన్మంజులా
     లాపంబుల్ ప్రకృతిస్థుఁ జేసె నను నుల్లాసంబుతోఁ గ్రమ్మఱన్.98
వ. కావున నింకఁ బెక్కుమాటలకుం బని లేదు మదీయవాక్యం బొక్కటి వినుండు.99
మ. విలయోద్దీప్తపతంగమండలసమావిర్భావదుర్భావసం
     కలనారౌద్రపరిక్రమం బయిన చక్రం బస్మదాభీల[3]దో
     ర్వలభీక్షేపవిరూప మై నిగిడి గీర్వాణారిఁ గంఠచ్ఛిదా
     చలితోదగ్రకబంధుఁ జేయు నపహృత్సైన్యంబుగాఁ జెచ్చెరన్.100
క. మీ రేమియుఁ దలఁకక చని, ప్రారంభింపుఁడు సమస్తభవ్యవిధుల్ బృం
     దారకయువతీలోచన, వారులు వెస నింకుఁగాక వారక యింకన్.101
క. స్థావరజంగమరూపము, లై వెలసిన యీజగంబు లన్నియు భీతి
     వ్యావేగవిరహితంబులు, గావుత మద్విక్రమంబు గని శీఘ్రమునన్.102
తే. అని జగత్పతి ప్రతిన సేయంగ నాక్ష, ణంబ దివినుండి దేవగణం బొనర్చు
     జయజయధ్వని యుప్పొంగి సర్వదిశలఁ, బరఁగె నఖిలజనశ్రోత్రపథము లలర.103

  1. నీరూపింప
  2. విధాశయంబులును; విధావిశాయినులు
  3. దోర్వలనక్షేపనిరూపమై