పుట:హరివంశము.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 3.

303

     నెనిమిదివేలు రథంబులుఁ బదనొకండువేలు నేనూరు గజంబులు నపరిమిత
     హయంబులు నసంఖ్యగోగణంబులు దానంబుగా నిచ్చి భూషణసంచయంబులు
     మణికాంచనరజతరాసులును వాసోవిభవంబులును దాసదాసీసముదయంబులు
     నొసంగి సూతమాగధగాయకనర్తకవందివైతాళికాదుల కపరిమికధనత్యాగంబుల
     ననురాగంబు గావించి సకలజనంబుల నభీష్టాన్నపానంబులఁ దృప్తులం జేసి
     మఱియును.167
క. కుడువుఁడు కట్టుఁడు కైకొని, యడుగుఁడు మీవలసినట్టి యర్థము లస్థుల్
     గడమ యొకింతయు వల దని, యెడపక ఘోషింషఁ బనిచె నెల్లెడ నెలమిన్.168
వ. వివాహదివసంబు లన్నియు నివ్విధంబునన కడచినం జతుర్ధకర్మానంతరంబున.169
తే. కట్ట నిప్పించుకొని తానుఁ గట్ట నిచ్చి, చుట్టములకును [1]లాఁతిరాజులకుఁ గరము
     నెయ్యమును గారవంబును నెఱయఁ బ్రీతి, సాలఁ గలిగించి తగవీడుకో లొనర్చె.170
క. మునుల నతిభక్తియోగం, బున నర్చనలను ముదంబుఁ బొందించి తదా
     నననిర్గతవాక్పూజల, జనితానందుఁ డయి ప్రియ మెసఁగ వీడ్కొలిపెన్.171
వ. తక్కినజనంబులును సముచితంబు లగుసత్కృతులం దదీయాదరంబుఁ గని ప్రమో
     దించి నిజనివాసంబుల కరిగిరి పదంపడి.172
మ. అనురాగంబులు ధన్యతన్ బొరయ నెయ్యంబుల్ ప్రియంబంద నె
     మ్మనముల్ గోర్కులు చూఱలాడఁ దనియన్ మాధుర్యముల్ ధుర్యతం
     గని జృంభింపఁగ సోయగంబులు సముత్కర్షంబు వాటింప న
     వ్వనజాక్షుండు విదర్భరాజసుతయున్ వర్తిల్లి రిచ్ఛాగతిన్.173
ఉ. చారువిహారసౌధముల సాగరతీరవనాంతరంబులన్
     భూరిమనోజ్ఞరైవతకభూధరకందరమందిరంబులన్
     హారీసరస్సమీపలతికావసధంబుల నమ్మృగాక్షి నిం
     పారఁగఁ దార్చి కేళిరతుఁ డయ్యె ముకుందుఁ డమందలోలతన్.174
సీ. రాగపల్లవముల [2]రమ్యలై యితరేతరాలోకలతలు పై నలమికొనఁగ
     నిష్టార్థరచనలయిక్కలై యన్యోన్యసల్లాపములు సుధాస్యందములుగ
     రోమాంచలీలలప్రోవులై యొండొరువులమూర్తు లాశ్లేషకలన సొగియఁ
     గ్రామ్యపూరములకళికలై సరిఁ బరస్పరచేష్ట లానందపదవి గొనఁగఁ
తే. గ్రమపరీపాక[3]భరమునఁ గలసి మెలసి, మనసు లొండొంటిమమతల మరగి [4]కరఁగ
     సతియుఁ బతియునుఁ బొలివోనిసౌఖ్యలహరిఁ, జిక్కి రనుభావనూత్నవిచిత్రతతుల.175
వ. రుక్మిణీవివాహానంతరంబ క్రమంబునఁ గృష్ణునకు మిత్రవిందయు జాంబవతియు
     సత్యభామయుఁ గాళిందియు లక్షణయు సుదంతయు నన నేడ్వురు భార్య లైరి

  1. లాతికిఁ జోద్యముగను, నిచ్చె సర్వంబు శ్రీకృష్ణుఁ డీప్సితములు
  2. రమ్యమై
  3. కామరూపములఁ గలసి; ఫలమునఁ గలసి బెరసి
  4. కొనఁగ