పుట:హరివంశము.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 9.

223

తే. హస్తిఁ గూలిచి యాలోన హస్తిపకుని, తలయు నొక్కవ్రేటునన వ్రయ్యలుగ నడిచి
     రెండుపీనుంగులు ధరిత్రితలమున, వికృతతరము లై యుండఁ గావించెఁ బ్రభుఁడు.101
వ. ఇట్లు కువలయాపీడంబు నిహతం బైనం గని యంబకతలంబున నున్న దివిజసిద్ధ
     గంధర్వప్రముఖులు మహామునిపూర్వకంబుగాఁ బూర్వజోపేతుం డగు నయ్యు
     పేంద్రు ననేకవిధంబులం బ్రస్తుతించుచుఁ బ్రమోదభతు లయిరి దేవకీసుతుం
     డును సింహనాదంబు నేసి సింహచంక్రమణంబున ననర్గళగమనుం డై రంగస్థలంబు
     సొచ్చె నట్టియెడ.102
సీ. కువలయాపీడంబు కొమ్ములపోటుల రుధిరంబు తన్మదస్రుతుల బెరసి
     కస్తూరికామిశ్రకాశ్మీరచర్చికాలలితమై భుజము లలంకరింపఁ
     గరములనున్న యాకరినాథురదనదండంబు కాలాభ్రతటస్థమైన
     దుర్ధరోత్పాతకేతువుఁబోలె భయదంబుగా నతిరౌద్రప్రకారుఁ డగుచు
తే. వచ్చుగోవిందు విక్రమవ్యాప్తభువనుఁ, బ్రజ్వలజ్జ్వలనార్కవిభాసిమూర్తి
     నఖిలదైత్యదానవదుర్జయాత్ము నాత్మ, కాలమృత్యువుఁ గంసుండు గనియె నెదుర.103
క. రంగస్థితజనములు వెఱ, నంగంబులు వడఁకఁ జూచి రవ్వభు నితఁ డి
     బ్భంగిఁ గవిసె నిక్కడి కే, భంగ మగునొ యెట్టు లగునొ పాకం బనుచున్.104
వ. అంత నధికక్రోధంబున నుగ్రలోచనుం డగుచు నుగ్రసేనసూనుండు.105
మ. ఘనుఁ జాణూరుఁ డనం ద్రిలోకములఁ బ్రఖ్యాతు న్మహామల్లు న
     వ్వనజాతేక్షణుతోడి బాహుసమరవ్యాసక్తికిం బంచె రా
     ముని మార్పెట్టి పెనంగ జెట్టిబిరుదున్ ముష్టిప్రకారైకలో
     చనదృష్టోద్యము ముష్టికాఖ్యు వెస నాజ్ఞాపించె సాటోపతన్.106
[1]వ. ఇవ్విధంబునం బంపువడి యంధ్రకోసలదేశీయు లగునమ్మల్లు లిద్దఱు నమ్మహావీరుల
     మార్కొనం గడంగి రందులోనఁ జాణూరుండు.107
సీ. అనిమిషేభంబుల నెనిమిదింటిని గూడఁ బెనఁచి మానిసిఁ జేయ బెలసె నొక్కొ
     ప్రళయానలార్కులపస యంతయుమ నావహించి ప్రోవిడఁగ దీపించె నొక్కొ
     పవమాను లందఱ పరమార్థవిధము రూపప్రౌఢి గైకొని ప్రబలె నొక్కొ
     గోత్రాచలంబువీఁకునఁ బట్టుకదలి సర్వావయవస్ఫూర్తి నడరె నొక్కొ
తే. యనఁగలావువేఁడిమి యురయంబుమూర్తి, పెనుపు నఖలాద్భుతంబులై పిక్కటిల్లఁ
     దాన జగజెట్టియై వెండి తనకు నెందు, మాఱుమల్లులు లేకుండ మలసినాఁడు.108
క. తన కప్పుడు నృపకార్యం, బునఁ గలపోరామియెల్ల మోచుటకతనన్
     ఘనసత్త్వశౌర్యములు సూ, ప నవశ్యం బగుటఁ బ్రకట[2]బాహాబలుఁడై.{float right|109}}
వ. ఘోరసన్నాహంబునం జనుదెంచి వారిజోదరుం జూచి యాక్షేపరూకాక్షరం
     బుగా ని ట్లనియె.110

  1. ఈ మల్లులను గూర్చి మూలమున నీ క్రిందివిధము గాఁ గలదు. శ్లో. ఆంధ్రమల్లంచ నికృతిం
    ముష్టికంచ మహాబలం. ఆధ్యా. 87. శ్లో.
  2. బాహాధికుఁడై