పుట:హరివంశము.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

హరివంశము

ఆ. పసులఁ గాచి గొల్లపడుచుల వెఱపించి, బిరు దితండ యనఁగఁ బేర్చి తిరిగి
     తట్లు గాదు నాకు నగ్గమై తిదె నేఁడు, దాయ యెందుఁ దప్పిపోయె దింక.111
క. పొరిపుచ్చెద నిప్పుడ యి, న్నరపతియును సభయు మెచ్చ నాచే జముకిం
     కరవర్గము గైకొనుఁగా, కరుదుగఁ గ్రొత్తచెఱ యెలమి నర్భక నిన్నున్.112
క. అనుటయు హరి కోపము నగ, వును బెరసినలోచనాంశువులరక్తత గం
     సుని ప్రళయసంధ్యయై యెం, దును బర్వఁగఁ జూచెఁ గఠినదుర్భరఫణితిన్.113
వ. చాణూరమల్లుతో నల్లన యి ట్లనియె.114
చ. నిను నిఖితార్థకారియుగ నెమ్మది నమ్మినవాఁడు కంసుఁ డె
     య్యనువున గ్రుస్సిపోక బలమంతయుఁ జూపుదుగాక రిత్త ర
     జ్జన బనిదీఱునే వెడఁగ చండితనంబున నీవు గన్నయీ
     యనుపమకీర్తి కింతట సమాప్తి యొనర్పఁగఁ జూప వచ్చితిన్.115
సీ. కడుఁబెద్ద క్రొవ్విన కాళియుతలలెల్ల జదియంగఁ ద్రొక్కినపదతలములు
     దుష్టాత్త్ముఁ డైనయరిష్టుని మెడపట్టి పొరిపోవ విఱిచినభుజయుగంబుఁ
     బిసితాశి యగు కేశిఁ బ్రేవులు వెడలంగఁ గడిమిమై దిగిచిన ఖరనఖములు
     నవినీతిఁ [1]జెనకినకువలయాపీడంబు [2]మోరఁ బగిల్చిన ముష్టిబలుపు
తే. నెఱుఁగ వెఱిఁగిన నిటు నేల యేపు మిగిలి, యెదురు నడతెంతువే నీవు నీక్షణంబ
     విఱిచి ప్రోవుపెట్టెదఁ జూచి వెఱుయు వెఱఁగు, పాటు గదిరి నీయేలిక బ్రమసిపడఁగ.116
వ. అని పలికి పెలుచన భుజస్ఫాలనంబు సేసి కడంగం జాణూరుండును దారుణా
     కారుం డై కవిసె నప్పుడు రంగంబంతయు నిశ్శబ్దం బై చూచుచుండె న య్యిరు
     వుర సుపలక్షించి యాదవులు దమలో ని ట్లనిరి.117
క. శైలనిభుఁడు చాణూరుఁడు, బాలుఁడు కృష్ణుండు వీరిబాహాయుద్ధం
     బాలోకింపఁగ నసదృశ, హేలం బిది యెఱుఁగవలదె యిచ్చటిపెద్దల్.118
వ. మల్లులతోఁ బెనంగువారికిం గాలజ్ఞులై సహాయులై చుట్లనుండి సలిలసేచనాద్యుప
     చారంబులఁ బరిశ్రమాపనయం బొనర్పవలయు బలంబునకుం గ్రియకు నంతరంబు
     నిరూపింపవలయు నిలుపం దగుతఱి యెఱింగి నిలుపవలయు నిది వేడుక పెనకువ
     గాని వీరికిం దమలోన రోషమాత్సర్యాదు లింతకుమున్ను లేవు గావున.119
తే. ఇంతటన మెచ్చి వీరి నుర్వీశ్వరుండు, పసదనం బిచ్చి మాన్చుట పాడి యింకఁ
     బలుకుతెంపును గడఁకయుఁ బంతమునకు, నొదవఁ గైకొన రిదె యెందు [3]నుచితపరత.120
క. అనుమాటలు విని వారికి, వనజోదరుఁ డిట్టు లనియె వలవదు మీ కి
     య్యనువున మును ప్రతిభటుతో, నను నిటు పోరించి చూచినం బగ దీఱున్.121
క. మనసుపదిలంబు గడిమియు, ఘనసత్త్వము శ్రమము పెంపు కల్మియు జయమున్
     బొనరించురంగయోధికిఁ, బనిగలదే యొడ్డుఁ బొడవు బ్రాయము నరయన్.122

  1. జేరిన
  2. మొఱవెట్టఁగూల్చిన ముష్టిబలుపు
  3. ఉచితపరుల