పుట:హరవిలాసము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106 హరవిలాసము

దొంగలింపఁ గంకణఝణఝణత్కారంబు తోరంబుగాఁ గెంగేలికేళీకమలంబునఁ బరాగరేణుత్రసరేణునిసరంబులతోడం గూడి మకరందబిందుధారాస్యందంబు చిందఁ బురందరనందనుని వ్రేసె వ్రేసిన నత్యంతధీరోదాత్తుండు గావునఁ జిత్తభవనమోహనాస్త్రవిదారణంబునకుం దార యగునవ్వేటున కంతరంబున మిసిమింతుండునుం గాక యేపాకంబునకు రాక రాకాచంద్రబింబంబువోని నెమ్మోము వాంచి నిర్వికారుండై యూరకుండె నివ్విధంబున నయ్యూర్వసియు వసిమాలఁ బెనంగి యక్కిరీటి చిక్కని మనంబుపక్కు గానక కానక కాసినవెన్నెలయుంబోలెఁ దనకన్నులవలపు మిన్నక పొలివోయినం జిన్నవోయి నిట్టూర్పులు నిగిడించుచు మనోరథవిఘాతప్రభవం బైనకోపంబు సైరింపక నరు నుద్దేశించి నపుంసకుండవుఁబోలె నాన గొన్నాఁడ వేఁడుకాలంబు నపుంసకుండవు గమ్మని శపించి దిగ్గన లేచి మొగంబు గంటువెట్టుకొని యింటికిం బోయె. యుధిష్ఠిరానుజుండును వసిష్ఠజననివలన గతకీర్తితాపన్నుండై యయ్యరిష్టంబునకు సంతాపంబు నొందక యది విధివశంబుగాఁ దలంచుచుండె నప్పుడు గగనంబుక్రేవంబడి యస్తమండలుండై హిమగభస్తి విరహవేదనాదూయమానమానసయగు మైత్రావరుణజనయిత్రి ఖిన్నవదనంబునుంబోలె వెలవెలఁ బాఱ విభావరీసమయంబునం ద్రిభాగావశేషం బగుటయు. 134

సీ. పారిజాతకలతాపల్లవంబులు మేసి కొనరె నుద్యానపుంస్కోకిలములు
గంథరాగ్రైవేయకనకఘంటిక మ్రోయ వేల్పుటేనిక యుషర్విధికి వెడలె
మందాకినీవీచిమారుతం బల్లార్చె నప్పరస్త్రీలనీలాలకముల
సప్తర్షి పావనాశ్రమవనాంతరమున నామ్నాయఘోష మభ్యధికమయ్యెఁ
తే. బాలవత్సంబుపైఁ గూర్మి బచ్చడిలుచుఁ గామధుగ్గవివచ్చుహుంకార మెచ్చె
శుక్రుగడియారమున మించె శంఖరవము, విబుధలోకంబునందలి వేగుఁబోక. 135

తే. మర్త్యలోకంబువారి ప్రమాణసంఖ్యఁ, బాండుసూనుండు గడపెను వజ్రయింట
సగము నిద్రయును సగము జాగరమును, నావిభావరి వేగుఁబో కాఱునెలలు. 136

సీ. మాటుగా వైచినమాంజిష్ఠతెర యెత్తి పంజుమంచము డిగ్గె మంజుఘోష
మొకరిమట్టెలమ్రోత ముద్దుచూపఁగ రంభ కనకంపుగొడుగు పాగారు దొడిగె
నొకట వేనలి మడ్చి యొక్కకేల ఘృతాచి గాజుఱెక్కలతల్పు గడియపుచ్చె
నలసభావముతోడ నలవోక ప్రమ్లోచ నిల్వుటద్దంబులో నీడ చూచె
తే. హరిణి గీలించె నలినపట్టాంశుకంబు
మేనక ధరించెఁ బాలిండ్లమీఁద ఱవిక
యప్సరస్త్రీనికేతనాభ్యంతరములఁ
గొక్కురోకో యటంచును గోళ్లు గూసె. 137