పుట:హంసవింశతి.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

x

పీఠిక.


గాన నీయపాయమే తగినదని భావించి యామార్గముననే తుట్టతుద కామెను సచ్ఛీలాలంకార భూషితనుగా నొనరించెను. కావున మొత్తముమీఁద గ్రంథము దుర్ణీతిబోధక మనరాదు. గ్రంథకర్తయాశయముగూడ నట్టిది కాదు.

వేడినీరు పోసిన నిండ్లు మండిపోవునేమో యని శంకనొందినట్లు ఒక్కొక్క కథను బఠించి కొంప మునిఁగిపోయేనే యని విభ్రాంతినొందుధీరస్వాంతుల కొక్కనమస్కార మనుటకన్న నెక్కునవ్రాయ నా కవసర మిటఁ గనఁబడలేదు.

ఇంతట నీవిషయ ముజ్జగించి యిమహాగ్రంథమునం గల పద్యములయందలి చమత్కృతింగూర్చి యించుక తెలిపెదను.

ఇమ్మహానుభావునకుం గలలోకజ్ఞాన మసమానమనుట యతిశయోక్తియని యెవ్వ రన రని నానమ్మకము, ఒక్కొక్క కథలోఁ బ్రస్తాపమునకుం దగిలినకులముల వారివిషయములు చర్చించునపు డీయనకుంగలలోకజ్ఞానము తేటపడఁగలదు. ఒక్కొక్క తెగవారికిం గావలసిన వస్తువులపేరులు, వారియాఁడువారికింగల యాభరణముల నామము లెట్లు తెలిసికొని కూర్చెనో యని యోజించునపుడు మనస్సు ఆశ్చర్యమును బొందక పోదు. పెక్కుప్రదేశములుతిరిగి యందున్న వారియాచారములు పరిశీలించుటలో నీతని శక్తి యనుపమానము. ఇంతమాత్రమే కాదు. ఒక్కయర్థముగలపదము లెన్నిగలవో యన్నియు నీతఁడు కూర్చి కవులకు మహోపకార మొనర్చెను. ఈక్రిందిపద్యములం బఠింపుఁడు.

సీ. వెలయ హరిశ్చంద్రువిధమున నలుని వీఁకను బురుకుత్సుచాడ్పునఁ బురూర
   వునిలీల, సగరు లాగునఁ, గార్తవీర్యుమర్యాదను గయుక్రియ నంబరీషు
   మతమున శశిబిందుమహిమ నంగుని ఠేవఁ బృథునిమాడ్కి మరుత్తవృత్తిభరతు
   నీతి సుహోత్రునిభాతి భార్గవుబలె రాముపోలిక భగీరథునిపొలుపు
   న, శిబిసంగతి, మాంధాత నయమునను, యయాతికరణి దిలీపునియట్ల రంతి
   రీతి నాచక్రవాళపరీతభూతధాత్రిపాలించుసవిభుండుదద్విభుండు. ౧ ఆ. 42ప.

ఇట్టిపద్యము లింకనుం గలవు. 2 ఆ. 14 ప. 5 ఆ. 86 పద్యములను జూచునది.

ఇంతియకాక శ్రుతిస్మృతి శాస్త్రపురాణేతిహాసాదుల నామములను, ధాన్యవిశేషముల పేర్లను, గూర్చినపద్యముల నొక్కసారి చదివినయెడలఁ బరమానందమును బాఠకు లనుభవింపకపోరు. సంస్కృతసమాసములు గలపద్యములను, దేశ్యపదములు గలపద్యములను జూచితిమా శిరఃకంప మొనర్చి బళీ యనకుండ వీలుండదు.

ఈయుదాహరణములు పైవిషయమును సిద్ధాంతీకరింపఁగలవు.