పుట:హంసవింశతి.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84 హంసవింశతి



సీ. చిఱుచెమ్మటలతోడ బెరసిన ఫాలంబు
కసవంటి వీడిన కప్పుఁ గొప్పు
కడురక్తిమము గల్గు గండస్థలంబులు
వెనుకకు దిగజాఱి వ్రేలు సరులు
పులకలు నిండారఁ బొడమిన దేహంబు
ధూళిధూసరితమై దొరయు వీఁపు
మందస్మితంబగు మధురాధరంబును
మందవీక్షణ నమ్రమస్తకంబు
తే. తడఁబడ వడంకుచుండెడు తలిరుఁదొడలు
వదలిన బిగించి సవరించు వలువ దసరఁ
దిరిగి చూచుచుఁ దనయిఁంటి తెరువుఁబట్టి
గొల్లప్రాయంపుఁ జిల్కలకొల్కి చనియె. 108

క. అది మొదలు జారశేఖరుఁ
డొదవిన యపుడెల్ల గొల్ల యుగ్మలి నెంతో
మదనాహవమునఁ దేల్చుచు
మదిమీఱఁగ మరుని లెంకమానిసిఁ జేసెన్. 109

క. చలివిడిచి జారశేఖరు
కలయిక చవిమరఁగి తెరువు కాఁపెట్టుక ని
చ్చలు లేనిపనుల నెన్నే
నలవఱచుకయుండు విరహ మగ్గలమైనన్. 110

ఉ. కమ్మనిజున్ను మంచినెయి గట్టిమీఁగడతోఁ బెరుంగు చొది
క్కమ్మగు జున్నుబాలు చిలుకమ్మిసిఁ దీసిన వెన్నముద్ద వె
చ్చమ్ముల కైదునాల్గుదివసాలకు మాడలముల్లె లిమ్మెయిం
గిమ్ములఁ దెచ్చియిచ్చు రతికిన్ బతిమాలుచుఁ బిల్చు నిచ్చలున్. 111