పుట:హంసవింశతి.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

తే. ఇటుల నజ్జారశేఖరుఁ డేలఁబట్టి
యింటిలోనున్న వస్తువు లెదురువెట్టి
వలపులకుఁజిక్కి కేరడములకుఁ జొక్కి
సంగమసుఖంబు కొన్నాళ్లు జరిపె గన్నె.

ఉ. అంతటఁ బెండ్లిచేసెద మటంచును దత్సతి తల్లిదండ్రు ల
త్యంతమహోత్సవంబునఁ గులాదులతోఁ దగురూపరేఖలన్
గంతునిఁబోలునట్టి మృదుకాయము గల్గినవాని నొక్కశ్రీ
మంతునిఁజూచి తెచ్చిరి కొమార్తె వివాహముఁ జేసి రేంతయున్.

తే. వేగఁ దలఁబ్రాలు గాఁజేసి నాగవల్లి
యైన పిమ్మట నత్తింటి కనుపఁ దలఁచి
పయన మొనరించి నెమ్మదిఁ బ్రమద మలర
ననుఁగుఁ గూఁతును నల్లుని ననిపి రపుడు.

ఉ. దువ్వెన తీరుగాఁ బసపుతో నలరించిన బొట్టు నున్నఁగా
దువ్వినకొప్పు వన్నెగల దుప్పట మొప్పు విడెంబు పుక్కిటన్
మవ్వపుఁబోఁగునూల్ రవల మద్దెలు చేతులఁ బూలగాజులున్
నివ్వటిలంగ గోప హరిణీ తరళేక్షణ పోవ ముందటన్.

సీ. సద్ద్విజరాజ సంశ్రయ మహాస్పదలీల
శాఖలు కకుబంత చయముఁ బ్రాఁక
సాంద్రవర్ణక్రమస్థాయిత్వమున మించు
జట లనంతావాప్తి పటిమ మెఱయ
విష్ణుపదార్పితవిహితవృత్తిఁ దనర్చు
నగ్రముల్ సప్తాశ్వు ననుకరింప
నహిలోకరాడ్భూషణాధారమై యొప్పు
మూలంబు కుండలిముఖ్యు జొరయఁ