పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

గిరులచే సర్వదిక్కరులచేఁ గాకున్న
                   నీవు ధరించిన నిలిచె ధాత్రి
సురలచే యామినీచరులచేఁ గాకున్న
                   నీవు బూనిన సుధానిధి లభించె
హరునిచే భారతీవరునిచేఁ గాకున్న
                   నీవల్ల రాక్షసాభావమయ్యె
నరునిచే నుర్వి నెవ్వరిచేతఁ గాకున్న
                   నీవల్ల మనె ధరాదేవసుతుఁడు


తే.

నీ కసాధ్యంబు గలదె వర్ణించిచూడ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

22


సీ.

పలికినప్పుడె సర్వపాపముల్ బాయు నీ
                   నామంబు బలుకని నాలుకేల
వినినయప్పుడె మనోవిజయమౌ మీకథల్
                   విననేరకుండిన వీనులేల
జూచినప్పుడె మహాశోభనంబగుమిమ్ము
                   జూడఁగోరని యట్టి చూపులేల
సేయునప్పుడె కార్యసిద్ధియౌ మీపదా
                   ర్చన సేయలేని హస్తంబు లేల


తే.

జ్ఞానవిషయంబు లీరీతి మాననగునె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

23


సీ.

క్రతుతపోదానసువ్రతసమాచారులై
                   ప్రీతి తత్ఫలము లర్చించువారి
మృత్తికాదారునిర్మితరూపు గాంచి
                   స్థిరభక్తి మిమ్ము నర్చించువారి
సుత దాస ధేను సంతతుల నీనామాంకి
                   తుల జేసి పేరుగా బిలచువారి
శుకశారికలకు సారెకు నుక్కెరల బెట్టి
                   నీనామముల బల్క నేర్పువారి


తే.

చేరి రక్షించుదువు వారివారి కొలదిఁ
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

24