పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ఏభువనంబునన్ దేభయాతురుండు నీ
                   చింత సేయునొ పరాకింత తగునె
ఏదిక్కునందు నీవే దిక్కనుచు నెవ్వఁ
                   డాత్మనిల్పునొ యలక్ష్యంబు దగునె
ఏదేశమం దెవ్వఁ డెట్టి కార్యాసక్తిఁ
                   జింత సేయునొ పరాకింత తగునె
ఏయూర నాబోటి హీనమనస్కుండు
                   శరణుజొచ్చునొ యుపేక్షకును దగునె


తే.

దీనబాంధవు డంచునుఁ దెలుపవలదె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

25


సీ.

ఏతండ్రి నిర్మించె భూతకపంచకగుణో
                   పేతావయవ సర్వచేతనంబు
లేదాత రక్షించు నెలమిమాత్రుదరస్థ
                   కలితశాబకుల వత్సలత మెరయ
నేసద్గురుఁడు దెల్పె హితవుగా సుజ్ఞాన
                   మెలమి గర్భస్థజీవులకు నెల్ల
నేస్వామి వెడలించె హేయదుర్భరగర్భ
                   నరకమగ్నుల బ్రాణవరదు డగుచు


తే.

నట్టిని న్నాశ్రయించెద ననవరతము
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

26


సీ.

శ్రీరమాసంభోగ శృంగారతల్పాహి
                   రాజన్యునకు వాయుభోజనంబు
యుద్ధాదికార్యసన్నద్దవాహనపతం
                   గాధీశునకు భుజంగాశనంబు
సంతతధ్యాననిశ్చలయోగయోగిరా
                   ట్ప్రతతికి ఫలపర్ణపారణంబు
జగదీశునకు సర్వసంపాదిత
                   రక్షితాద్యాది సర్వావనంబు


తే.

ఘనము స్వామి సిరి గల్గి లౌభ్య మేమి
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

27