పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే.

దొరకితివి నాకు నిశ్శంక విడువనింక
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

6


సీ.

కుబ్జగంధ మొసంగి కొమరుఁబ్రాయంబున
                   శాతకుంభశలాక రీతి నుండె
మాలికుం డొక్కండు మాలికర్చన జేసి
                   మౌమలు గనఁగ నిర్మలతఁ గాంచె
రజకుఁడు శుభ్రవస్త్రములు గట్టఁగనిచ్చి
                   ఇహపరసౌఖ్యంబు లెనసి మించె
విదురుఁ డిష్టాన్నంపు విందులు గావించి
                   భాగవతోత్తమ ప్రతిభ గాంచె


తే.

కులము కారణమా నీకు గుణమె గాని
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

7


సీ.

మృతగురుపుత్రుని బ్రతికించుటే సాక్షి
                   బ్రాణార్థులై మిమ్ముఁ బలుకువారి
కల కుచేలున కెల్లకలుము లిచ్చుటె సాక్షి
                   సౌఖ్యార్థియై మిమ్ముఁ జదువువారి
కర్జునసారథ్య మమరఁజేయుటె సాక్షి
                   విజయార్థులై మిమ్ము వేడువారి
కోలి నుత్తరగర్భ మెలమిఁ బ్రోచుటె సాక్షి
                   పుత్రార్థులై మిమ్ముఁ బొగడువారి


తే.

కన్నికోర్కెలు గల్గు నిన్ సన్నుతింప
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

8


సీ.

నిను యశోదాదేవి పెనురోటఁ గట్టె నా
                   వనిత స్వతంత్ర మెంతని భజింతు
నిను నందుఁ డాలకుఱ్ఱల గాయనుంచె నా
                   ఘనుని సామర్థ్య మెంతని నుతింతు
నాభీరమతులు ని న్నాప్తత బెనఁగి రా
                   తనయుల భాగ్య మెంతని గణింతు
గోపకాంతలు నిన్ను కోపించితిట్టి రా
                   నవఁబోండ్ల రేఖ నెంతని వచింతు


తే.

వారి దాసానుదాసులే ధీరులైన
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

9