పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

శ్రీ సీతారామాంజనేయసంవాదము

దగనది మదీయనిక్షేప మగుపదార్థ
మైన నెఱిఁగింతు నీకు నెయ్యంబువలన. 44

టీక. అనినన్ = అని పార్వతి ప్రశ్నింపఁగా, విని, నవ్వి, శంభుఁడు, ఇట్లు, అనియెన్, ఈవు = నీవు, అడుగ రానిరహస్యార్థంబున్ = అడుగకూడని మిగుల రహస్యమగు విషయమును, (సంపూర్ణ మగు నధికారము గలవానికిఁ గాని చెప్పకూడదు. అని దాచియుంచిన విషయమును,) అడిగితివి, తగన్ - ఒప్పునట్లుగా, ఇది = నీకుఁ జెప్పఁబోవువిషయము, మదీ ...పము - మదీయ= నాసంబంధమైన, నిక్షేపము=నిధి, అగుపదార్థము = అయినవస్తువు, (ఒకనిధివలె నాచే మిగుల ప్రేమింపఁబడువస్తువు.) ఐనన్ = అయినప్పటికిని, నెయ్యంబువలనన్ = నీయందున్న ప్రేమాతిశయమువలన, నీకున్, ఎఱిఁగింతున్ = ఉపదేశించెదను.

తా. పైనచూపఁ బడినవిధముగాఁ బార్వతీదేవి ప్రశ్న చేయఁగా, దానిని విని “ఏదియో అడుగు నని తలంచు చుంటిని. అట్లుగాక చక్కని ప్రశ్న చేశినది” అని నవ్వి, యా యీశ్వరుఁ డిట్లని చెప్పెను. ఓ పార్వతీ! అడుగఁ గూడనివిషయమును అడిగితివి. నీ ప్రశ్నమునకుఁ జెప్పవలసినయుత్తరము అతిరహస్యమైనది. సర్వసాధారణముగ బయలుపఱుపఁ దగినది కాదు. ముఖ్యముగ నాచే పెన్నిధివలె ప్రేమింపఁబడుచుండు నది. అట్లయినను, నీయందుప్రేమ యధికము గావున నీకు సవిస్తరముగా నెఱింగించెదను వినుము.

ఆప . ప్రశ్నమునకు శివుఁ డిచ్చినయుత్తరమును వర్ణించుచున్నాడు...

తే. శ్రీమనోరామ శ్రీరామరామరామ
    యనుచు రమియింతు రామునియంద రామ
    నామము వరానన సహస్రనామతుల్య
    మట్లు గావున దీని నీ వవధరింపు.45

టీక. వరానన = సుందర మగుముఖము గలిగినట్టియు, శ్రీ...రామ - శ్రీ = బ్రహ్మజ్ఞానమను సంపదతోఁ గూడిన, మనః = (నా) మనస్సును, రామ = రమింపఁ జేయునట్టి, {అనఁగా : ఆనందపఱచునట్టి) ఓ పార్వతీ, శ్రీరామరామరామ అనుచున్ - శ్రీ రామ రామరామ అని జపము చేయుచు, రామునియంద = పరమానందరూపుడగు నాపరబ్రహ్మమునందే, (లేక, రామపదముచేఁ జెప్పఁబడు మహావిష్ణువునందే) నేను, రమియింతున్ = క్రీడించుచుందును . (ఆనఁగా: ఆనందము నొందుచుందును.) నామము = ఈరామనామము, సహస్రనామతుల్యము = కృష్ణ విష్ణు మొదలగు పేర్లు వేయింటితో (లేక ప్రసిద్ధములగు విష్ణుసహస్రనామములతో) సమానము. అట్లు కావునన్, దీనిన్, నీవు అవధరింపు = తెలిసికొనుము. (ఈ పద్యమున మొదటి పాదమందు, రామ,