పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

శ్రీ సీతారామాంజనేయసంవాదము


చుటే అంతరశబ్దానువిద్ధ సవికల్పకసమాధి.

5. ఈ చతుర్విధసవికల్పకసమాధులయందు సుస్థిరతగలిగి అంతర బాహ్యములయందు తనకు నన్యమేమియు తోఁపక, తోఁచినను సముద్రమునందు ముంచినకుండ లోపల వెలుపల పరిపూర్ణమై ఆకాశమందుంచిన కుండ లోపల వెలుపల శూన్యమైనట్లుండుటే బాహ్యనిర్వికల్పసమాధి.

6. పైనఁచెప్పినవృత్తు లేవియులేక ఆఖండపరిపూర్ణ సచ్చిదానందపరబ్రహ్మ స్వరూపమయి ఉండుటే అంతరనిర్వికల్పకసమాధి.

ఆ. ప్రాణనాథ తనదుపతిని గొల్చుటకంటె, వేఱుపనులుగలవె చారుమతికి
    గాన నీదుసేవఁగావించుటయెకాని, యొండుకోర్కి లే దఖండమూర్తి.

టీక. ప్రాణనాథ = ఓ ప్రాణేశ్వరా! చారుమతికిన్ = మంచిమనస్సుగల స్త్రీకి, తనదుపతికిన్ = తనభర్తను, కొల్చుటకంటె = సేవించుటకంటెను, వేఱుపనులు, కలవె = ఉన్నవా? (లేవుఅనుట), కానన్ = కావున, అఖండమూర్తి = ఓసర్వవ్యాపకా! నీదుసేవన్ కావించుట ఎ కాని = నీకు సేవ చేయుటయే తప్ప (నాసేవను ప్రేమతో స్వీకరింపవలయు ననుటయే తప్ప) ఒండుకోర్కి = మఱియొక యిచ్ఛ, లేదు.

తా. ఓ సర్వవ్యాపకా! ప్రాణనాయకా! పతివ్రతలగు స్త్రీలకుఁ బతిని సేవించుటకంటె కావలసినది వేఱేమియు లేదుగదా? కావున నాకును మిమ్ము సేవించుచుండవలయు ననుటకంటె వేఱొకకోర్కి లేదు.

ఆ. అయిన నీ కభీష్ట మడుగు మిచ్చెదనని, యానతిచ్చిరి మహాత్మ ఇపుడు,
    గాన నాకు నెల్ల మానవులకు మేలు, గలుగనొకటియడుగవలసెననఘ.

టీ. ఐనన్ = అట్లు అయినప్పటికినీ, మహాత్మ , ఇపుడు, నీకు, అభీష్టమున్ = కావలసినదానిని, అడుగుము, ఇచ్చెదను, అని, ఆనతిచ్చితిరి = ఆజ్ఞ చేసితిరి. కానన్ అనఘా = పాపరహితుఁడ వైనయో మహాత్మా, ఎల్లమానవులకున్ = సకల జనులకును, మేలు కలుగన్ = మేలగునట్లుగా, ఒకటిన్ = ఒకదానిని, నాకున్, అడుగన్ , వలసెన్

తా. ఓ పాపరహితా! మహానుభావా! భర్త సేవకంటె నితరమైనది పతివ్రతల కక్కఱ లేకపోయినను పతియాజ్ఞను పరిపాలించుట ముఖ్యధర్మము కావున నాకు లోకహితార్థముగా, నొక్క దాని నడుగవలసి వచ్చినది. “నీ కిష్టమైనదాని నడుగుము ఇచ్చెదను" అని మీరు నన్ను ఆజ్ఞాపించియుంటిరి గదా! దాని మీఱుట సరియగునా!

అవతారిక . ఇట్లు గౌరీప్రశ్నమునకుఁ గారణమును వర్ణించి యీ క్రింద ప్రశ్నస్వరూపమును వర్ణించు చున్నాఁడు.

క. నిఖలకలుషసంక్షయకర, మఖిలాభీష్టప్రదం బనంతావ్యయచి,
   త్సుఖదము జగదధిపత్యభి, ముఖకరమగుమంత్రరాజముం గృపఁ జెపుమా.