పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

39


పరిపాకమువలన కాకతాళీయన్యాయముగ దైవికముచేత జ్ఞానముగలవాఁడై, “ఆయ్యో నేనేల మూఢుఁడ నయితిని? ఈయపార సంసారసాగరమెట్లుదాఁటఁగల' నని పరితపించి సజ్జనుల చేరువఁ జేరి వారి యపారకరుణాపూరసేవనంబున దురాపంబు లగుతాపంబులు తీఱి పిమ్మట వారల యుపదేశబలంబున సత్కర్మాచరణమును వేదాంత శాస్త్రపరిజ్ఞానమును ఇహపరలోకభోగ విరక్తియుఁగలిగి మోక్షము నపేక్షించుట. విచారణయనఁగా : అద్వైతశాస్త్రపరిజ్ఞానంబును సత్సంగమంబును వైరాగ్యంబును గలిగి బ్రహ్మమెయ్యది యని విచారించుట. తనుమానసయనఁగా; ఈరెండు భూమి కలసాధన పూర్ణముగఁ గలిగి దారుణము లగు విషయేంద్రియముల త్రిప్పులోఁ దగు లక; మనసును క్షీణింపఁజేయుట. దీనికి అసంగమమని మఱియొకపేరు గలదు, ఆయసంగమము సామాన్యమని విశేషమని ద్వివిధము. మఱియు నది సామాన్యవిశేష భేదములచేత నాల్గు విధములు. అందు సామాన్యాసంగమమనఁగా; శబ్దాదివిషయముల యందు నేను కర్తను భోక్తను గురువును శిష్యుఁడను బాధ్యుఁడను బాధకుఁడను గాను. సుఖదుఃఖము లీశ్వరాధీనములు, యోగవియోగభోగరాగాదులు కాలవశములని యెంచి దేనియం దాశలేకయుండుట. సామాన్యసామాన్యాసంగమమనఁగా, సంచితకర్మముల చేత లభ్యములైన సుఖదుఃఖములయందు ప్రియాప్రియములు లేక, వానినంటకముందు విచారించిన వేదాంత మహావాక్యార్థనిశ్చయమందుఁజేరుట. విశేషాసంగమమనఁగా సత్సహవాసమువలనను, అపరోక్షజ్ఞానమువలనను, పురుషప్రయత్నమువలనను, జ్ఞాన శాస్త్రములసంగతాభ్యాసమువలనను, పరమవస్తువు కరతలామలకమై కనఁబడుచుండఁ గా, సంసారసాగరోత్తారకమై, పరతత్త్వస్థితిఁజెంది, సకలమునీశ్వరాధీనమనుటను, కర్మమే సుఖదుఃఖములకుఁ గారణమగుటను మాని మౌనియై పరమశాంతిగలిగియుండు విశేషవిశేషాసంగమమనఁగా, బాహ్యాభ్యంతరములను ఊర్ధ్యాధఃప్రదేశములను దిక్కులను ఆకాశమును స్థావరజంగమజంతువులను చీకటి వెలుతురులను చిజ్జడములను సకలవస్తువులను అవస్థానుభవములను వేఱుగాఁ జూడక అఖండాకారముగఁ జూచుచు చిత్తవిశ్రాంతి గలిగి నిస్సంకల్పుఁడై ముందుదర్శించిన యాత్మ యందు మనస్సుకరుగుట. ఈమూఁడు భూమికలలో దేనినైన నభ్యాసముచేయుతఱిని మృతులైనయోగులు దేవ విమానములయందు దేవతాస్త్రీలతో కూడి స్వర్గవైకుంఠ కైలాసాది పుణ్యలోకముల యందు సకలదివ్యభోగములు చిరకాల మనుభవించినవెనుక, శ్లో. "శుచీనాం శ్రీ మతాం గేహే యోగభ్రష్టో హి జాయతే, అథవా యోగినా మేవ కులే భవతి ధీమతాం.” అను గీతావచనప్రకారముగ భూలోకంబున శ్రీమంతులయింటఁ బుట్టి పూర్వము తాను విడిచిన నెలవునఁ జేరి క్రమముగా నావల్లభూమిక నెక్కును, మూఁడు భూమికలవఱకు జన్మము గలదు. తక్కిన భూమికలయందు జన్మము లేదు. సత్త్వాపత్తియనఁ గా, ఈ మూఁడుభూమికల నభ్యసించి యింద్రియార్థములయం దాశ