పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

25


టీక. ఆజనార్దనగురునకున్ , అత్యద్భుతముగన్ = మిగుల నాశ్చర్యముగ, శ్రీమదేకోగురుస్వామి= బ్రహ్మజ్ఞానము గలయేకోగురుస్వామి యనువాడు, మును = పూర్వకాలమున, వసిష్టమహామునీంద్రునకున్ = వసిష్ఠమహర్షికి, అర్థిన్ = ఆదరముతో, దాశరథి = శ్రీరాముఁడు, శిష్యుఁ డైనచందంబు = శిష్యుఁ డైన విధము, తనరన్ = ఒప్పునట్లుగా, శిష్యుఁడు, అయ్యెన్.

తా. ము న్నారామభద్రుఁడు వసిష్ఠమహామునికి శిష్యుఁడైనట్లు బ్రహ్మవేత్తలలో నగ్రేసరుం డగు నేకోగురుస్వామి యాజనార్ధనయోగీంద్రునకు శిష్యు డయ్యెను.

సీ. తనదువైరాగ్యంబు గనుగొని సిగ్గుచే, సనకాదిమును లజువెనుక నొదుగఁ
    దనదుసద్భక్తిచే దగఁ గట్టువడి యింట, శ్రీకృష్ణుఁ డాత్మీయసేవఁ జేయఁ
    దనదువిజ్ఞానతీర్థమునందుఁ గ్రుంకుచు,గంగాదినదు లెల్ల గంతు లిడఁగఁ
    దనదుపూర్ణాత్మసంతతసమాధినిజూచి, ప్రహ్లాదుఁడాశ్చర్యపరత నొంద

తే. స్వకృతగీతాదిశాస్త్రభాష్యంబు లెల్ల
   వేదతుల్యంబు లై ధాత్రి వెలయుచుండ
   వామదేవశుకార్జునవ్యాసభీష్మ
   సదృశుఁ డేకోజనార్దనస్వామి వెలసె. 24

టీక. తనదువైరాగ్యంబున్ = తనకుఁగల వైరాగ్యాతిశయమును, కనుఁగొని= చూచి, సిగ్గుచే = తమకట్టివైరాగ్యము లేదను నవమానముచే, సనకాదిమునులు = బ్రహ్మయొక్క మానసపుత్రులగు (సంకల్పముచేతనే జనించినవార లగు) సనకసనందనాదిఋషులు, అజువెనుకన్ - బ్రహ్మదేవునివెనుక భాగమున, డాఁగన్ = దాఁగుచుండఁగా, (ఇచ్చట బ్రహ్మమానసపుత్రులగువారు బ్రహ్మకు సమీపమునం దుఁడు టస్వభావమే యైనను, ఏకోగురుస్వామి యొక్క వైరాగ్యమును జూచి, సిగ్గుజెందుటచేఁ గలిగినదిగా నుత్ప్రేక్ష చేయబడెను.) తనదుసద్భక్తిచేన్ = తనయొక్క అత్యుత్తమమైనభక్తిచేత, తగన్ = ఒప్పునట్లుగా, కట్టువడి, ఇంటన్ = తనగృహమునందు, నిలిచి, శ్రీకృష్ణుడు, ఆత్మీయసేవన్ = తనయొక్కసేవ , చేయన్ = చేయుచుండఁగా, తనదు విజ్ఞానతీర్థమునందున్ = తనయొక్క బ్రహ్మజ్ఞాన మనియెడుతీర్థమందు, క్రుంకుచున్ = స్నానముచేయుచు, గంగాదినదు లెల్లన్ = గంగమొదలగు లోకపావనము లైన నదులన్నియు, గంతులిడఁగన్ = విఱ్ఱవీగుచుండఁగా, (గంగాదినదులు లోకమును పావనము చేయుట స్వాభావికమే యైనను అది యేకోగురుస్వామియొక్క జ్ఞానతీర్థమునందు మునుంగుటవలనఁ గలిగినదిగా నిచట నుత్ప్రేక్షింపఁబడెను.) తన... సమాధిని - తనదు = తనయొక్క, పూర్ణ = సర్వవ్యాపకుఁడైన, ఆత్మ = పరబ్రహ్మమునకు సంబంధించిన, సంతత = అధికమగు, (లేక,