పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

శ్రీ సీతారామాంజనేయసంవాదము



    క్షరవిరళముఁ గొని మదిసం
    స్మరియించుట మానసికము స్వాధ్యాయమగున్.

తే. అందువాచిక జపమున కధికతర ము
    పాంశుజపమ య్యుపాంశుజపమున కధిక
    తరము మానసజప మగు దాని కధిక
    తరములేదని తెలియు మో ధర్మనిరత.

తా. స్వాధ్యాయము వాచికమని ఉపాంశువని మానసికమని మూఁడువిధములు.
అందు అన్యునికీ వినఁబడునట్లు పఠించుట వాచికము; అన్యునికి వినఁబడకుండునట్లు
పఠించుట ఉపాంశువు; ప్రత్యక్షరమును విరళించి మనసునందే జపించుటమానసికము.

ఈశ్వరప్రణిధానలక్షణము.


సీ. కరణంబు లఖలోపకరణంబులును గాఁగఁ
          బ్రాణంబు లుపచారభటులుగాఁగ
    గంగాప్రముఖ నాడికలు జలంబులు గాఁగ
          షట్కమలములు పుష్పములు గాఁగ
    జఠరాగ్నిహోత్ర ముజ్జ్వలధూపముం గాఁగఁ
          బటుజీవకళలు దీపంబు గాఁగ
    నందితానందంబు నైవేద్యముం గాఁగ
          రవిశశిజ్యోతు లారతులుగాఁగ

తే. నంగ దేవాలయమున సహస్రకమల
    పీఠమున శాంతి జనకజోపేతుఁ డగుచుఁ
    జెలఁగుపరమాత్ము రాము నర్చించుచుండఁ
    దత్త్వవిదు లీశ్వర ప్రణిధాన మండ్రు.

తా. జ్ఞానేంద్రియములును కర్మేంద్రియములును అంతరింద్రియములును పూజా
పాత్రములుగాను, దశవిధప్రాణములు పనివాండ్రు గాను, గంగాయమునాసరస్వత్యాది
నామములు గల ఇడ పింగళ షుషుమ్న మొదలగు నాడులు అభిషేకాదిజలములుగాను,
ఆధారాదిషట్కమలములు పుష్పములుగాను, జఠరాగ్ని ధూపముగాను, చిత్కళలు
దీపములుగాను, బ్రహ్మానందము నైవేద్యము గాను, సూర్యచంద్రమండలజ్యోతు
లారతులుగాను, శరీరమనెడు దేవాలయమండలి సహస్రారకమలమనెడి సింహాసనమున
శాంతియను సీతతోఁగూడిన పరబ్రహ్మమను శ్రీ రాముని నెల్లప్పుడు పూజించుచుం
డుటయె యీశ్వరప్రణిధానమని బ్రహ్మవాదులయిన పెద్దలు పలుకుదురు.