పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

v

వంశనామమునకు మూలమైన 'కొరవి' గ్రామము వరంగల్లు జిల్లాలో ఉన్నది. గోపరాజు పెదతాత కొడుకులు రాచకొండ నేలిన అనపోత కుమార సింగయకు మంత్రులుగా ఉండిరి. రాచకొండ నల్లగొండజిల్లాలోనిది. కవిస్తుతిలో వేములవాడ భీమకవికి ప్రత్యేకముగా ఒక పద్యమును వ్రాసెను. వేములవాడ కరీంనగరం జిల్లాలో ఉన్నది. ..

ఇందలి ఇరువది యొకటవ బొమ్మ కథలో మూలమున లేని భువనగిరిని (నల్లగొండ), ఓరుగంటిని(వరంగల్లు), గోదావరి నదిని, కాళేశ్వరమును (ఆదిలాబాదు), ధర్మపురిని (కరీంనగరం) వర్ణించెను. వీనినిబట్టి గోపరాజు కరీంనగరము వరంగల్లు జిల్లా ప్రాంతమువాడై యుండునని భావింపవచ్చును.

కవికాలము - ఇతని కాలమును గూర్చి పలుపురు పండితులు విశేష చర్చలు చేసి విభిన్నాభిప్రాయములను ప్రకటించినారు. శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు 1480 సం|| ప్రాంతమువాడని[1] శ్రీ కందుకూరు వీరేశలింగం పంతులుగారు 17 శతాబ్దివాడని,[2] శ్రీ చాగంటి శేషయ్యగారు 1430-90 మధ్య ఆని[3], శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు గారు 1350-1410 మధ్య అని[4], శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు శకవర్షముల 14 శతాబ్ది మధ్య గాని, చివరగాని ఉండవచ్చునని,[5] డా॥ నేలటూరి వేంకట రమణయ్య గారు 15 శతాబ్దివాడని[6], శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు 15 శతాబ్ది చివరివాడని[7], శ్రీ ఆరుద్రగారు 1500-1530 అని[8], చెప్పినారు.

ఇందరు ఇన్ని విధములుగ చెప్పుటకు ప్రధాన కారణము కొరవి వంశ మూల పురుషుడగు. వెన్నా మాత్యునకు గోపరాజు ఏడవ పురుషుడుగా చెప్ప

  1. ప్రథమ ముద్రణ పీఠిక
  2. ఆంధ్ర కవుల చరిత్ర
  3. ఆంధ్ర కవి తరంగిణి
  4. ఆం.సా. పరిషత్ పత్రిక
  5. History of the Reddy Kingdoms
  6. వాజ్మయ వ్యాసమంజరి
  7. ఆంధ్ర సాహిత్య చరిత్ర
  8. సమగ్రాంధ్ర సాహిత్యము