పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సారంగధర నాటకప్రదర్శనము

27


చున్న మహావైరాగ్య విజ్ఞానభాగధేయమైన యొక్క కొడుకుపై-నవమాసములు మోసి కాంచిన తల్లియైన రత్నాంగికి-మగనికోఁత సవతిరోఁత గలిగిన రత్నాంగీకి-కొడుకును జూచుకొని సంతోషించుటకంటె వేరువేడబమే లేని రత్నాంగికి-కత్తికోఁతకంటెఁ గాలసర్పదశనఘాత కంటే గహనాగ్నికీలికాసంహతీకంటెఁ గడుపుచిచ్చే భరియింపరానిదై యుండఁదగిన రత్నాంగికి-అదరు లేదు-బెదరులేదు-మొగమున దైన్యము లేదు. కంట నీటిచుక్క లేదు. గొంతుకలో బిగింపు లేదు. గుండెలో దడలేదు. లోకసంగ్రహార్థ మేడువవలయు ననుచింతయయినలేదు. ఏమియు లేదు. ఎంతమాత్రమును లేదు. మొద్దు! మొఱఁడు! అయ్యయ్యో! మొద్దులాగుండినను నేను సంతోషింతునే! నేను ❝బళి❞ యని సుతింతునే? కొడుకు దుఃఖమును భరింపలేక కొఱుడు పాఱిపోయిన దని యొకరితోఁ జెప్పి నాలో నేననుకొని సంతుష్టి జెందియుందునే! అయ్యయ్యో! ఆమాత్ర మవకాశ మయినఁ గలుగనీకుండ ముద్దులొలుకఁ బాడుచున్నదే! ముక్తాయించుచున్నదే! ఆహా యిది యెంత ప్రారబ్ధము! అంతటితల్లు లిట్టివారయినఁ బ్రపంచ మొక్క పగటిలోఁ బ్రళయావస్థ నొందియుండునే? అంతట సారంగధరుఁ డొకకీర్తన పాడినాఁడు. దానితో మూఁడవయంకము పూర్తియయినది.

నాలుగవయంకము ప్రథమరంగమునకై తెరయెత్తఁబడఁగ సారంగధరుని మరమం చముమీఁదఁ బరుడఁబెట్టి యిద్దఱు తలారులు గండ్ర గొడ్డళ్లతోఁ గాలు సేతులు నటకుచున్నారు. ఆరాజపుత్రుని దీక్ష-పరాకాష్ఠ-యేమోకాని, యట్టభయంకరావసానసమయమందైన -నాబాలునకు-రాగ మెక్కడ సంకర మగునో, తాళ మెక్కడ ధ్వంస మగునో యను మహాందోళనమే కాని మఱియేచింతయు లేడుగదా? ఆతని చేతులను దలారులు ఖండించుచుండఁగ నాతఁడు పాడుచున్న యెదురెత్తులయ గలపాటలోఁ దాళ మెక్కడఁ జెడిపోవునోయని కాలిమడమతో మంచపు పట్టెమీఁదఁ దాటించుచునేయున్నాఁడు. తాళము పోవుబాధ,ప్రాణము పోవుబాధకంటె నెక్కువది కాదా? లయ బ్రహ్మమని చెప్పుటచేఁ దాళము చెడఁగొట్టిన బ్రహ్మహత్య దోషము సిద్ధింపదా? తెర తన యిష్టానుసార మప్పుడు దిగెను.

అయిదవయంకమున మీననాథుఁడు ప్రవేశించుటయు, నాతఁడు సారంగధరుని బ్రదికించుటయుఁ, దరువాతఁ గునూరునిఁ దల్లిదండ్రులతోఁ గలుపుటయు మొదలగు కథాభాగములన్నియు నేకైకచరణధురీణములగు చిన్నచిన్న పార్షిమట్లుగలపాటతో నాంధ్రికరణ మొందిన టుమీటప్పాలతోఁ బాటకు మిక్కిలి యుపయుక్తములగు వింతవింత వృత్తములతోఁ బల్లవిమార్గపుటందుకట్లతోఁ జౌకపుమార్గపుఁ గారుకమ్మచ్చులతీఁగ సాగింపు లతో ముగింపఁబడినవి నాటకప్రదర్శనము పూర్తి యగుటచే జనులు లేచిపోయిరి.

రూపకాలోకమునమనస్సు మిక్కిలి చెడుటచే శేషించిన రాత్రి బొత్తిగ నాకు నిద్రలేదు. సోదరులారా! ఇంతవింతనాటకమును జూచిన పాపము శాంతించునుగాక, పాపము శాంతించు నుగాక యని లెంపలు వైచుకొంటిని. నూనదుఁడు మేఁకలగొంతుకలను బఱబఱఁ గోయు చుండ మనసు చెదరకుండఁ జూడవచ్చును. మాదిగవాఁడు గొడ్డలి పుచ్చుకొని గొడ్డుతలను బళ్లునఁ బగులఁగొట్టి చర్మమొలిచి మాంసమును ఖండఖండములుగఁ జేయుచుండ గంటఁ దడిపెట్టకుండఁ జూడవచ్చును. కత్తులవ్రేటుతోఁ బల్లెపుఁబోటులతోఁ దుపాకి గుండ్లతో ఫిరంగియుపద్రవములతో మహాసంఘమరణ మొందినజనుల కళేబరములు