పుట:సత్యశోధన.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

75

ఈ విధంగా లాటిన్ చదువు దక్షిణాఫ్రికా దేశపు చట్టాలను తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడింది.

ఇంగ్లాండు దేశపు కామన్‌లాను రాత్రింబవళ్ళు చదవడానికి నాకు తొమ్మిది నెలలు పట్టింది. బ్రూముగారి “కామన్‌లా” పెద్దది. కాని చదవడానికి బాగుండేది. కాలం మాత్రం చాలా పట్టింది. స్నెల్ గారి “ఈక్విటీ” అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. వైట్ ట్యూడర్ రచించిన “లీడింగ్ కేసెస్” అను గ్రంథంలో కొన్ని కేసులు తప్పనిసరిగా చదువతగ్గవి. ఆ గ్రంథం హృదయరంజకం, జ్ఞానదాయకం. విలియం ఎడ్వర్డ్‌గార్ల “రియల్ ప్రాపర్టీ” గుస్వ్ గారి “పర్సనల్ ప్రాపర్టీ” అని గ్రంథాలు సంతోషంతో చదివాను. విలియం గారి పుస్తకం చదవడానికి నవలగా వుంటుంది. మెయిన్‌గారి “హిందూ లా” ఎంతో అభిరుచితో చదివాను. హిందూదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఓడలో దాన్ని చదివినట్లు గుర్తు. హిందూ లా గ్రంథాన్ని గురించి విశ్లేషించడానికి ఇది తరుణం కాదు.

నేను పరీక్ష ప్యాసయ్యాను. ది 10 జూన్ 1891లో పట్టా చేతికందింది. 11వ తేదీన ఇంగ్లాండు హైకోర్టులో రెండున్నర షిల్లింగులు చెల్లించి పేరు రిజిష్టరు చేయించుకున్నాను. 12వ తేదీన ఇంటికి బయలుదేరాను.

ఇంత చదివిన తరువాత కూడా నన్ను పెద్ద బెంగ పట్టుకుంది. కోర్టులో వాదించడానికి నేను తగనని భయం వేసింది.

ఆ క్షోభను గురించి వర్ణించేందుకు మరో ప్రకరణం అవసరం.

25. నన్ను పట్టుకున్న పెద్ద బెంగ

బారిష్టరు అని అనిపించుకోవడం తేలికే గాని బారిష్టరీ చేయడం మాత్రం కష్టమని తోచింది. లా చదివాను గాని, వకీలు వృత్తి నేర్చుకోలేదు. లా లో అనేక ధర్మ సిద్ధాంతాలు చదివాను. అవి నాకు నచ్చాయి. కాని వాటిని వృత్తిలో ఎలా అమలుబరచాలో బోధపడలేదు. “ఇతరుల ఆస్థికి నష్టం కలుగకుండా నీ సర్వస్వాన్ని వినియోగించు” అనునది ధర్మవచనం. కాని వకీలు వృత్తికి పూనుకొని వాది విషయంలో ఈ సిద్ధాంతాన్ని ఎలా అమలుపరచగలమో బోధపడలేదు. ఈ సిద్ధాంతం అమలుబరచబడిన కేసుల వివరం చదివాను. కాని అ వివరంలో ఈ సిద్ధాంతాల్ని అమలుబరచిన ఉపాయాలు లభించలేదు.

నేను చదివిన చట్టాలలో హిందూదేశానికి సంబంధించిన చట్టాలు ఏమీ లేవు. హిందూ చట్టాలు ఇస్లాం చట్టాలు ఎలా వుంటాయో నేను తెలుసుకోలేకపోయాను. దావాలు ఎలా వేయాలో తెలియదు. పెద్ద బెంగ పట్టుకున్నది. ఫిరోజ్ షా మెహతాగారి