పుట:సత్యశోధన.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

నన్ను పట్టుకున్న పెద్ద బెంగ

పేరు విన్నాను. ఆయన కోర్టుల్లో సింహంలా గర్జిస్తాడని విన్నాను. ఆంగ్ల దేశంలో ఆయన ఏ విధంగా చదివారో తెలియదు. ఆయన లాంటి తెలివి ఈ జీవితంలో నాకు అబ్బదు అని అనిపించింది. ఒక వకీలుగా వృత్తి చేసుకుంటూ జీవనం గడుపుకునేందుకు అవసరమైన భృతి సంపాదించగలనా అని అనుమానం కూడా నన్ను పట్టుకుంది,

లా చదువుతున్న రోజుల్లోనే ఈ సంశయం కలిగి బాధపడ్డాను. మిత్రులతో ఈ విషయం చెప్పాను. దాదాభాయి నౌరోజీగారి సలహా తీసుకోమని ఒక మిత్రుడు చెప్పాడు. నేను ఇంగ్లాండుకు వెళ్ళేటప్పుడు శ్రీ దాదాభాయి నౌరోజీగారి పేరిట కూడా ఒక సిఫార్సు పత్రం తీసుకువెళ్ళానని గతంలో వ్రాశాను. చాలాకాలం తరువాత నేనా ఉత్తరాన్ని బయటికి తీశాను. ఆ మహా పురుషుని దర్శించటానికి నాకు గల అధికారం ఏమిటా అని యోచించాను. వారి ఉపన్యాసం జరుగుతుందని తెలియగానే నేను ఆ సభకు వెళ్ళి ఒక మూల కూర్చొని వారిని కండ్లారా చూచి వారి ఉపన్యాసం శ్రద్ధగా చెవులారా వినేవాణ్ణి. విద్యార్థుల బాగోగులను గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక సంఘం స్థాపించారు. ఆ సభలకు నేను విధిగా వెళుతూ ఉన్నాను. నౌరోజీగారు విద్యార్థుల పట్ల చూపే ప్రేమ, వాత్సల్యం విద్యార్థులు వారి యెడ చూపే శ్రద్ధాభక్తులు చూచి ఎంతో ఆనందించాను. ఒకరోజు ధైర్యం తెచ్చుకొని సిఫార్సు ఉత్తరం పుచ్చుకొని వారి దగ్గరకు వెళ్ళాను. “నీ కిష్టమైనప్పుడల్లా వచ్చి నన్ను కలవవచ్చు” అని ఆయన అన్నారు. అయితే ఆ అవకాశం నేను ఉపయోగించుకోలేదు. అవసరం లేనప్పుడు వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టంలేక ఆ సలహాను నేను అమలుచేయలేదు.

ఫెడరిక్ పిన్‌కట్ గారిని దర్శించమని ఆ మిత్రుడే సలహా యిచ్చాడో లేక మరో మిత్రుడే ఇచ్చాడో గుర్తులేదు. పిన్‌కట్‌గారు మితవాది. పూర్వాచారపరాయణుడు. భారతీయ విద్యార్థుల మీద ఆయన చూపే ప్రేమ నిర్మలం, నిస్వార్థమయం. విద్యార్థులు సలహా కోసం వారి దగ్గరకు వెళుతూ వుండేవారు. నేను కూడా వారి దర్శనం కోసం వెళ్ళాను. ఆ సంభాషణను నేను మరిచిపోలేను. ఒక మిత్రునితో సంభాషించినట్లు ఆయన నాతో మాట్లాడారు. నన్ను పట్టుకున్న బెంగను నవ్వుతూ పోగొట్టారు. “ఏమిటి? అంతా ఫిరోజ్ షా మెహతాలు అవుతారా? ఫిరోజ్‌షాలు, బదురుద్దీనులు కొద్దిమందే ఉంటారు. లాయరవడానికి గొప్పతెలివితేటలు ఉండాలని భావించకు. ప్రామాణికత్వం, శ్రద్ధ ఉంటే చాలు. తద్వారా అవసరమైనంత డబ్బు సంపాదించవచ్చు. దావాలన్నీ చిక్కులమయంగా ఉండవు అని చెప్పి, సరే, పాఠ్యపుస్తకాలు కాక ఇంకా ఇతర పుస్తకాలు ఏమేమి చదివావో చెప్పు!” అని అడిగారు.