పుట:సత్యశోధన.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

55

బాగా నడిచింది. కాని ఆ తరువాత కొద్దినెలలకు మూతబడింది. నేను కొద్దికాలం తరువాత మరో చోటుకి బస మార్చుకుంటూ వుండేవాణ్ణి. ఆ ప్రకారం ఆ ప్రదేశాన్నుండి నా నివాసాన్ని మార్చాను. కాని ఈ కొద్ది అనుభవం కొన్ని సంస్థలు స్థాపించి ప్రచారంలోకి తేగల శక్తి నాకు ప్రసాదించింది.


18. బిడియం డాలుగా పనిచేసింది

అన్నాహారమండల కార్యనిర్వాహక సమితికి మెంబరుగా ఎన్నుకోబడి ప్రతి మీటింగుకి హాజరవుతూ వుండేవాణ్ణి. కాని మాట్లాడటానికి నోరు తెరుపుడు పడేదికాదు. డాక్టర్ ఓల్డ్‌ఫీల్డు ఈ విషయం గమనించి “నీవు నాతో బాగా మాట్లాడతావు కాని సమావేశంలో ఎన్నడూ నోరు తెరవవు. అందువల్ల నీకు మొగతేనెటీగ అను పేరు పెట్టవచ్చు” అని అన్నాడు. నాకు ఆయన వ్యంగ్యం అర్థమైంది. ఆడతేనెటీగలు ఎప్పుడూ శ్రమపడుతూ ఉంటాయి. కాని మొగతేనెటీగ తినడం తాగడమే కాని పనిచేయదు. సోమరిపోతన్నమాట. కమిటీ మీటింగులో అంతా తమ తమ అభిప్రాయాలు చెబుతూ వుండేవారు. కాని నేను మాత్రం నోరు తెరిచేవాణ్ణి కాదు. మాట్లాడాలనే కాంక్ష లేక కాదు. నోరు తెరిస్తే ఏం మాట్లాడాలి! నాకంటే మిగతా మెంబర్లంతా ఎక్కువ తెలిసిన వారుగా కనపడేవారు. ఒక్కొక్కప్పుడు విషయం మీద మాట్లాడాలని సిద్ధపడేవాణ్ణి కాని ఇంతలో మరో విషయం మీద చర్చ ప్రారంభమయ్యేది.

ఈ పద్ధతి కొంతకాలం దాకా నడిచింది. ఒక పర్యాయం గంభీరమైన సమస్య కమిటీ ముందుకు వచ్చింది. ఆ సభకు వెళ్ళకపోవడం అనుచితం. ఏమీ మాట్లాడకుండా వోటు ఇవ్వడం పిరికితనం. థేమ్స్ ఐరన్ వర్క్సు కంపెనీ అధ్యక్షుడు హల్స్‌గారు ఆ సభకు అధ్యక్షులు. అతడు నీతివాది. ఆయన ఇచ్చే ధనసహాయంతోనే ఆ సంఘం నిలచియున్నదని చెప్పవచ్చు. సభ్యుల్లో చాలామంది ఆయన గొడుగు నీడలో వుండునట్టివారే. శాకాహార విషయంలో ప్రసిద్ధికెక్కిన అల్లిన్సన్ గారు కూడా కార్యవర్గ సభ్యులు. డాక్టర్ అల్లిన్సన్ గారికి సంతాన నిరోధం ఇష్టం. దాన్ని గురించి జనానికి ప్రబోధిస్తూ వుండేవాడు. ఈ పద్ధతులు నీతివంతమైనవి కావనీ హిల్స్‌గారి అభిమతం. ఈ శాకాహార సంఘం కేవలం శాకాహారాన్ని గురించియే గాక నీతిని గురించి కూడా ప్రచారం చేయాలని ఆయన ఉద్దేశ్యం. విపరీత భావాలుగల అల్లిన్సన్‌గారి వంటి వారి నీతి బాహ్యాలైన ఉద్దేశ్యాలు కలవారు సంఘంలో వుండరాదని హిల్స్‌గారి తలంపు. కావున అల్లిన్సన్‌గారిని ఆ సంఘాన్నుంచి తొలగించాలనీ ఒక ప్రతిపాదన తెచ్చారు. ఈ చర్య నా హృదయాన్ని ఆకర్షించింది. సంతానం కలగకుండ ఉపాయాలు చేయాలని