పుట:సత్యశోధన.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

బిడియం డాలుగా పనిచేసింది

అల్లిన్సన్‌గారి ఉద్దేశ్యం భయంకరమైనదని నేను భావించాను. అయితే హిల్స్‌గారు నీతివాదియగుట వలన అల్లిన్సన్‌గారికి వ్యతిరేకం కావడం కూడా సరియేయని భావించాను. హిల్స్‌గారి ఔదార్యం చూచి వారియెడ నేను ఆదరణ కలిగి యుండేవాణ్ణి. అయితే నీతి విషయంలో అభిప్రాయ భేదం ఏర్పడినంత మాత్రాన ఒక పెద్ద మనిషిని శాకాహార సంఘాన్నుంచి తొలగించడం మంచిది కాదని అభిప్రాయపడ్డాను. హిల్స్‌గారు నీతివాది కావడం వల్ల ఇటువంటి అభిప్రాయాన్ని వ్యతిరేకించవచ్చు. కాని దానికీ, శాకాహార సంఘ ఉద్దేశ్యానికీ సంబంధం లేదని నా అభిప్రాయం. శాకాహార సంఘ లక్ష్యం శాకాహార విధానాన్ని ముమ్మరం చేయడమే కాని నీతివాదాన్ని ప్రచారం చేయడం కాదు. అందువల్ల నీతికి సంబంధించిన అభిప్రాయాలు ఎలా వున్నప్పటికీ శాకాహార సంఘాన్నుంచి ఒకరిని తొలగించకూడదనే నిర్ణయానికి నేను వచ్చాను.

ఈ విషయంలో సంఘ సభ్యుల్లో ఎక్కువమంది నాతో ఏకీభవించారు. అయితే ఈ విషయం నేనే సమావేశంలో మాట్లాడాలని భావించాను. అది ఎలా సాధ్యం? నాకు సాహసం లేదు. అందువల్ల కాగితం మీద వ్రాసుకొని వెళ్లాను. దాన్ని చదవడానికి కూడా సాహసం చాలక అధ్యక్షుడికి ఆ కాగితం అందజేశాను. ఆయన నా కాగితం ఇంకొకరిచేత చదివించాడు. డాǁ అల్లిన్సన్‌గారి పక్షం ఓడిపోయింది. ప్రథమ ప్రయత్నంలో నాకు అపజయం కలిగింది. అయినా నా అభిప్రాయం సరియైనదేనను అభిప్రాయం కలిగి నాకు తృప్తి కలిగింది. తరువాత నాకు ఆ సమితిలో సభ్యత్వం వద్దని కోరినట్లు గుర్తు. ఆంగ్లదేశంలో వున్నంతకాలం నన్ను సిగ్గు బిడియం వదలలేదు. మిత్రుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు కూడా పదిమంది చేరితే నోరు మెదపలేకపోయేవాడిని.

నేను ఒకసారి వెంటసన్ అను ఊరు వెళ్ళాను. నా వెంట మజుందార్ కూడా వున్నాడు. ఒక శాకాహారి ఇంట్లో బసచేశాం. “ది ఎతిక్స్ ఆఫ్ డైట్” అను గ్రంథం రచించిన హోవర్డుగారు కూడ అక్కడే నివసిస్తున్నారు. ఇది రేవు పట్టణం. ఆరోగ్యవంతమైన ప్రదేశం. మేము హోవర్డుగారిని కలిసి మాట్లాడాము. ఆయన శాకాహార ప్రవర్తక సభలో ఉపన్యసించమని మమ్మల్ని ఆహ్వానించారు. అట్టి సభలో వ్రాసుకొని వెళ్ళి చదవడం తప్పుకాదని తెలుసుకున్నాను. పరస్పర సంబంధం పోకుండా వుండేందుకు, ప్రసంగం క్లుప్తంగా వుండేందుకుగాను చాలామంది అట్లా చేస్తారని తెలిసింది. ఆశువుగా ఉపన్యసించడం అసంభవం. అందువల్ల అనుకున్న విషయమంతా వ్రాసి తీసుకువెళ్లాను. ఒక ఫుల్‌స్కేపు టావు కంటే అది ఎక్కువగా లేదు. కాని లేచి నుంచునేసరికి కళ్ళు తిరిగాయి. వణుకు పట్టుకుంది. అప్పుడు మజుందార్ నా కాగితం తీసుకొని చదివారు.