పుట:సత్యశోధన.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

41

 యజమానుల్ని నౌకర్లు మాత్రమే అయ్యా అని సంబోధిస్తారు. హోటల్లో ఉంటే ధనం బాగా ఖర్చువుతుంది. కావున ఏదో కుటుంబంలో చేరడం మంచిది.” అని చెప్పాడు. సోమవారం నాడు ఒక నిర్ణయానికి వద్దామని భావించాం.

శ్రీ మజుందారు గారికీ, నాకు కూడ హోటలు ఖర్చు అధికమనిపించింది. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సింధు మిత్రుడు మాతోబాటు ప్రయాణించాడు. ఆయనకీ మజుందారుగారికీ స్నేహం కలిసింది. ఆయనకు లండను కొత్త కాదు. లండనులో మీకు అద్దె గదులు యిప్పిస్తానని ఆయన మాకు చెప్పాడు. మేము అంగీకరించాము. సోమవారంనాడు గ్రిండ్లే కంపెనీ వారు మా సామాన్లు మాకు అందజేశారు. హోటలు వాళ్ళకు ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చి వేశాము. మా సింధు మిత్రుడు మా కోసం చూచి పెట్టిన గదుల్లో ప్రవేశించాం. హోటలు గదికి చెల్లించాల్సిన అద్దె క్రింద నా వంతు సొమ్ము మూడు పౌండ్లు చెల్లించివేశాను. నేను బిల్లు చూచి నివ్వెరపోయాను. ఇంత సామ్ము చెల్లించి కూడా ఆకలితోనే వున్నాను. హోటలు భోజనం రుచించలేదు. ఒక వస్తువు తీసుకొని రుచి చూచాను. అది రుచించలేదు. మరో వస్తువు తీశాను. రెండిటికీ సొమ్ము చెల్లించవలసి వచ్చింది. బొంబాయి నుండి వెంట తెచ్చుకున్న తినుబండారాల మీదనే ఆధారపడవలసి వచ్చింది.

ఈ క్రొత్తగదుల్లో కూడా నాకు ఏమీ తోచలేదు. నా మనస్సు ఎప్పుడూ దేశం మీద, ఇంటిమీద, అమ్మమీద కేంద్రితమై వుండేది. బెంగగా వుండేది. రాత్రి ఇంటి సంగతులు జ్ఞాపకం వచ్చేవి. ఒకటే ఏడుపు. రాత్రిళ్ళు నిద్రలేదు. నా కష్టం ఇంకొకరితో చెప్పుకునేది కాదు. చెప్పి ఏం ప్రయోజనం? అంతా క్రొత్త. పాశ్చాత్య దేశాచారాలు నాకు క్రొత్త. ఎంతో జాగ్రత్తగా వుండాలని భావించాను. పైగా శాకాహారం గురించి నేను చేసిన ప్రతిజ్ఞ ఒకటి. అక్కడి ఆహార పదార్థాలు రుచిగా లేవు. ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యిగా మారింది నా పని. ఇంగ్లాండులో వుండలేను. తిరిగి ఇండియాకు వెళ్ళలేను. మధనలో పడిపోయాను. చివరకు ఈ మూడు సంవత్సరాలు ఇక్కడ గడపవలసిందే అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది నాకు కలగిన అంతరాత్మ ప్రబోధం.

14. నా అభిరుచి

డాక్టర్ మెహతా నన్ను కలుసుకునేందుకై విక్టోరియా హోటలు వెళ్ళారు. అక్కడ మా అడ్రసు తెలుసుకుని మా బసకు వచ్చారు.