పుట:సత్యశోధన.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

చివరికి సీమ చేరాను

తినేవాళ్ళు కూడా మాంసం తినడం లేదని సర్టిఫికెట్లు పుచ్చుకోవడం చూచాను. దానితో ఈ విధమైన సర్టిఫికెట్ల మోజు తగ్గిపోయింది. మాటకు విలువ వుండాలే గాని ఈ విధమైన సర్టిఫికెట్ల వల్ల ప్రయోజనం ఏముంటుందని అనిపించింది.

ప్రయాణం ముగించుకొని మేము సౌదెంప్టన్ చేరాం. ఆనాడు శనివారం అని గుర్తు, నా మిత్రులు తెల్లని ఉన్ని సూటు (ఫాంటు, కోటు, వెస్టుకోటు) తయారు చేయించి ఇచ్చారు. ఓడలో నల్ల సూటు ధరించాను. రేవులో దిగినప్పుడు తెల్ల సూటు బాగుంటుందని భావించి దాన్ని ధరించాను. అవి సెప్టెంబరు మాసం చివరి రోజులు. నేను తప్ప మరెవ్వరూ అటువంటి సూటు ధరించలేదు. చాలామంది తమ సామాను, తాళం చెవుల్తో సహా గ్రిండ్లే కంపెనీ ఏజంటుకు అప్పగించడం చూచి నేను కూడా ఆలాగే నా సామాను వారికి అప్పగించాను.

డాక్టర్ ప్రాణ్ జీవన్ మెహతా. దలపత్‌రాం శుక్ల, రణజిత్ సింగ్ మహారాజ్, దాదాభాయి నౌరోజీ గార్ల పేరిట మిత్రులు ఇచ్చిన సిఫారసు పత్రాలు నా దగ్గర వున్నాయి. లండనులో విక్టోరియా హోటలులో బస చేయమని ఒకరు ఓడలో మాకు సలహా ఇచ్చారు. ఆ ప్రకారం నేను, మజుందారు యిద్దరం విక్టోరియా హోటలుకు వెళ్ళాం. తెల్ల దుస్తుల్లో వెలివేసినట్లు నేనొక్కణ్ణే అక్కడ కనబడుతూ వుండటం వల్ల బాధపడ్డాను. మర్నాడు ఆదివారం. అందువల్ల గ్రిండ్లే కంపెనీ వారు సామను ఇవ్వరని తెలిసి చిరాకు పడ్డాను.

సౌదెంప్టస్ నుంచి డాక్టర్ మెహతాగారికి నేను తంతి పంపాను. అది వారికి అందింది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు హోటలుకు వచ్చి నన్ను కలిశారు. నన్ను ఎంతో ఆదరంగా చూచారు. నా ఉన్ని దుస్తుల్ని చూచి ఆయన నవ్వారు. మాటల సందర్బంలో అయాచితంగా వారి హేట్‌ను చేతిలోకి తీసుకున్నాను. దాని మృదుత్వాన్ని పరిశీలిద్దామని చేతితో దాన్ని అటూ ఇటూ త్రిప్పి దానిమీద గల రోమాల్ని నిమరడం ప్రారంభించాను. మెహతాగారు కొంచెం చిరాకు పడి నన్ను వారించారు. కాని అప్పటికే నా వల్ల పొరపాటు జరిగిపోయింది. ఇది మొదటి మందలింపు. పాశ్చాత్య దేశంలో యిది నేను నేర్చుకున్న మొదటి పాఠం. ఆ దేశ విశేషాల్ని గురించి మెహతాగారు చెబుతూ “ఇతరుల వస్తువుల్ని తాకకూడదు. హిందూ దేశంలో వలె ఇక్కడ ప్రథమ పరిచయం కాగానే ఎవ్వరినీ ప్రశ్నలు వేయకూడదు. హిందూ దేశంలో ఎదుటివారిని మనం అయ్యా అని సంబోధిస్తాం, ఇక్కడ ఆవిధంగా సంబోధించకూడదు. ఇక్కడ