పుట:సత్యశోధన.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

441

సాక్షాత్కారం కోసం ప్రతిజీవిని, ప్రతిప్రాణిని ఆత్మ స్వరూపంలో ప్రేమించడం చాలా అవసరం. అట్టి అభిలాషగల మనిషి జీవన స్రవంతికి దూరంగా వుండలేడు. అందువల్ల సత్యారాధనయే నన్ను రాజనీతిలోకి దింపింది. ధర్మానికీ రాజనీతికీ సంబంధం లేదని చెప్పేవారికి ధర్మమంటే ఏమిటో తెలియదని గట్టిగా చెప్పగలను. అలా చెప్పడం అవిధేయత కానేరదు. ఆత్మశుద్ధి లేనిదే ప్రతి జీవితో సమైక్యత ఏర్పడదు. ఆత్మశుద్ధిలేనిదే అహింసా ధర్మపాలన సాధ్యపడదు. అశుద్ధాత్మ పరమేశ్వరుని దర్శనం పొందలేదు. అందువల్ల జీవన నగరంలో ప్రతిభాగము పరిశుద్ధంగా ఉండటం అవసరం. ఇట్టి శుద్ధి సర్వులకు సాధ్యమే. వ్యష్టికి సమిష్టికి మధ్య ఎంతో దగ్గర సంబంధం వున్నది. ఒక వ్యక్తి యొక్క శుద్ధి అనేకుల శుద్ధికి తోడ్పడుతుంది. వ్యక్తిగతంగా ప్రయత్నించగల శక్తి సామర్థ్యాలను సత్యనారాయణుడు సర్వులకు పుట్టుక నుండి ప్రసాదించాడు.

అయితే శుద్ధి యొక్క సాక్షాత్కారం భయంకరమైనది. అట్టి అనుభవం ప్రతిక్షణం నేను పొందుతూ వున్నాను. శుద్ధి కావడమంటే మనోవాక్కాయ కర్మేణ నిర్వికారుడు కావడమే. రాగద్వేషరహితుడు కావడమే. యిట్టి నిర్వికార ప్రవృత్తిని అలవరచుకొనుటకు ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నప్పటికీ నేను ఆ స్థితిని యింకా అందుకోలేదు. ప్రజలు నన్ను ఎంత పొగడినా, ఆ పొగడ్త నన్ను ఏమరుపాటులో పడవేయదు. అట్టి పొగడ్త నా మదిలో గుచ్చుకుంటూ వుంటుంది. మనస్సులో గల వికారాలను జయించడం ప్రపంచాన్ని శస్త్రాస్త్రాల యుద్ధంలో జయించడం కంటే కష్టమైనదని నాకు కలిగిన అనుభవం. హిందూ దేశానికి వచ్చిన తరువాత కూడా నా మనస్సులో గల వికారాలను చూచాను. చూచి సిగ్గుపడ్డాను. కాని ధైర్యం మాత్రం సడలనీయలేదు. సత్యశోధన కావించుతూ రసానందం పొందాను. యిప్పుడూ పొందుతూ వున్నాను. కంటకావృతమైన మార్గం దాటవలసియున్నదని నాకు తెలుసు. అందు నిమిత్తం నేను శూన్యుణ్ణి అయిపోవాలి. మానవుడు తన యిష్టప్రకారం అందరికంటే వెనుక తనను నిలబెట్టుకోవాలి. అందరి కంటే తాను బహుతక్కువ వాడనని భావించాలి. ఆ స్థితికి చేరుకోనంతవరకు ముక్తి పొందలేడు. అహింస వినమ్రతకు పరాకాష్ట. వినమ్రతను అలవరచుకోనిదే ఏ కాలంలోను ముక్తి లభించదని అనుభవం మీద చెబుతున్నాను. అట్టి వినమ్రత కోసం ప్రార్థిస్తూ, అందుకు విశ్వసహాయాన్ని యాచిస్తూ ఈ ప్రకరణాలను ముగిస్తున్నాను.


* సమాప్తం *