పుట:సత్యశోధన.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

440

పూర్ణాహుతి

44. పూర్ణాహుతి

ఇక యీ ప్రకరణాల్ని ముగించవలసిన సమయం ఆసన్నమైంది. ఆ తరువాత నా జీవితం పూర్తి ప్రజామయం అయిపోయింది. ప్రజలకు తెలియని అంశం అంటూ నా జీవనంలో ఏమీ మిగలలేదు. 1921 నుండి జాతీయ కాంగ్రెసు నాయకులందరితో అమితంగా మమేకం అయిపోయాను. ఏమి రాయాలన్నా నాయకులకు సంబంధించిన ఘట్టాలను వర్ణించకుండా వుండలేని స్థితి ఏర్పడింది. వారితో నాకు బహు దగ్గర సంబంధం ఏర్పడింది. శ్రద్ధానంద్, దేశబంధు, లాలాజీ, హకీం సాహబ్ యిప్పుడు మన మధ్య లేరు. అదృష్టవశాత్తు యితర పలువురు నాయకులు మన మధ్య వున్నారు. జాతీయ కాంగ్రెస్‌లో వచ్చిన మార్పును గురించిన చరిత్ర యిప్పుడు వ్రాయబడుతూ వున్నది. నా ప్రధాన ప్రయోగాలన్నీ కాంగ్రెస్ ద్వారానే జరిగాయి. ఆ ప్రయోగాలను గురించి వ్రాయ పూనుకుంటే ఆ నాయకుల్ని గురించి వ్రాయక తప్పదు. శిష్టత దృష్ట్యా కూడా ఆ విషయాలను యిప్పుడు వ్రాయలేను. యిప్పుడు నేను చేస్తున్న ప్రయోగాలను గురించిన నా నిర్ణయాలు నిర్ణయాత్మకాలుగా పరిగణింపబడవు. అందువల్ల ఈ ప్రకరణాలను తాత్కాలికంగా ఆపివేయడం అవసరమని భావిస్తున్నాను. నా కలం యిక ముందుకు సాగనంటున్నది అని చెప్పగలను. పాఠకుల దగ్గర సెలవు తీసుకోవలసి వచ్చినందుకు విచారంగా వుంది. నా ప్రయోగాలకు నా దృష్టిలో అమిత విలువ వుంది. వాటిని యధాతధంగా వర్ణించకలిగానో లేదో నాకు తెలియదు. యదార్ధ చిత్రణ చేయాలని నా మటుకు నేను అమితంగా కృషిచేశాను. సత్యాన్ని నేను ఏవిధంగా చూచానో, ఏ రూపంలో చూచానో, ఆ రూపంలో దాన్ని వివరించడానికి సదా ప్రయత్నించాను. యీ ప్రయోగాల వల్ల పాఠకుల మనస్సులో సత్యము, అహింసల యెడ అధికంగా విశ్వాసం ఏర్పడుతుందని నా నమ్మకం. సత్యంకంటే మించి మరో భగవంతుడు వున్నాడనే అనుభవం నాకు కలుగలేదు. సత్యమయం కావడానికి అహింసయే ఏకైక మార్గం. ఈ విషయం ఈ ప్రకరణాల ప్రతి పేజీలో వెల్లడికాకపోతే నా కృషి అంతా వ్యర్థమేనని భావిస్తున్నాను. ప్రయత్నాలు వ్యర్థం కావు కదా! నా అహింస సత్యమయం అయినా అది యింకా అపూర్ణమే, అపరిపక్వమే. వేలాది సూర్యుల్ని ప్రోగుచేసినా, సత్యమనే సూర్యుణ్ణి చూడలేము. అంత తీక్షణమైనది సత్యం. అయినా ఆ సూర్యుని కిరణాన్ని మాత్రం దర్శించవచ్చు. అహింస లేనిదే అట్టి దర్శనం లభించడం సాధ్యంకాదు. ఇప్పటివరకు జీవితంలో పొందిన అనేక అనుభవాల నాధారంగా చేసుకొని ఈమాట చెబుతున్నాను. ఇట్టి వ్యాప్తి చెందిన సత్యపారాయణుని