పుట:సత్యశోధన.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

418

పంజాబులో

ఇందూలాల్ అంగీకరించారు. ఆ మాసపత్రికను మేము వారపత్రికగా మార్చాము. ఇంతలో క్రానికల్‌కి మళ్లీ ప్రాణం వచ్చింది. అందువల్ల యంగ్ ఇండియా వారపత్రికగా మారింది. దాన్ని నా సలహా ప్రకారం అహమదాబాదుకు మార్చారు. రెండు పత్రికల్ని వేరు వేరు చోట్ల నుండి వెలువరించాలంటే ఖర్చు పెరిగింది. శ్రమ కూడా హెచ్చింది. నవజీవన్ పత్రిక అహమ్మదాబాద్ నుండే వెలువడుతున్నది. అటువంటి పత్రికలు నడపాలంటే సొంత ప్రెస్సుఅవసరమను విషయం ఇండియన్ ఒపీనియన్ అను పత్రిక నడుపుతూ వున్నప్పుడు నాకు బోధపడింది. వ్యాపార దృక్పధంతో సొంత ప్రెస్సులో ముద్రించబడే పత్రికల్లో ఆయా పత్రికాధిపతులు నా అభిప్రాయాల్ని ప్రకటించడానికి భయపడుతూ వుండేవారు. ఇది కూడా సొంత ప్రెస్సు పెట్టడానికి ఒక కారణం. అహమదాబాదులోనే అది సాధ్యం గనుక యంగ్ ఇండియాను అహమదాబాదుకు మార్చారు.

ఈ పత్రికల ద్వారా సత్యాగ్రహాన్ని గురించిన వివరాలు ప్రజలకు తెలపడం ప్రారంభించాను. ప్రారంభంలో రెండు పత్రికల ప్రతులు కొద్దిగా ముద్రించబడుతూ వుండేవి. ఆ సంఖ్య పెరిగి 40 వేలకు చేరుకున్నది. నవజీవన్ పత్రిక చందాదారులు ఒక్కసారిగా పెరిగారు. యంగ్ ఇండియా చందాదారులు నెమ్మదిగా పెరిగారు. నేను జైలుకు వెళ్లిన తరువాత యీ వెల్లువ తగ్గుముఖం పట్టింది. రెండు పత్రికల్లోను విజ్ఞాపనలు ప్రకటించకూడదని మొదటి నుండి నా నిర్ణయం. దానివల్ల నష్టం కలుగలేదని నా అభిప్రాయం. పత్రికల్లో భావనా ప్రకటనకు గల స్వాతంత్ర్య రక్షణకు యీ విధానం బాగా తోడ్పడింది. ఈ పత్రికలు వెలువడటంతో నాకు శాంతి లభించింది. సహాయ నిరాకరణోద్యమం వెంటనే ప్రారంభించలేకపోయినా నా అభిప్రాయాల్ని ప్రకటించ గల అవకాశం దొరికింది. సలహాల కోసం నా వంక చూస్తున్న వారికి ధైర్యం చేకూర్చగలిగాను. ఆ రెండు పత్రికలు గడ్డుసమయంలో ప్రజలకు అధికంగా సేవ చేయగలిగాయని నా అభిప్రాయం. మిలిటరీ చట్టాల దుర్మార్గాల్ని ఎండగట్టి వాటిని తగ్గించడానికి కూడా కృషి చేశాయి. 

35. పంజాబులో

పంజాబులో జరిగిన ఘోరాలకన్నింటికీ అపరాధిని నేనేనని సర్ మైకేల్ ఓడయర్ నిర్ణయించారు. ఇక అక్కడ కొందరు నవయువకులు మార్షల్ లాకు కారణం నేనేనని, నేను అపరాధిని అనడానికి కూడా వెనుకాడలేదు. కోపంతో