పుట:సత్యశోధన.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

417

రోజూ పంజాబులో జరుగుతున్న ఘోరకృత్యాలు తెలుస్తున్నాయి. వాటినివింటూ పండ్లు కొరుకుతూ వుండిపోవలసిన స్థితి ఏర్పడింది.

ఇదే సమయాన క్రానికల్ పత్రికను ప్రచండశక్తిగా రూపొందించిన మిస్టర్ హార్నమెన్‌ను ప్రజలకు తెలియకుండా రహస్యంగా ప్రభుత్వం ఎత్తుకుపోయింది. ఈ దొంగతనంలో నిండివున్న దుర్వాసన యీనాటివరకు నాకు కొడుతూనేవున్నది. మి. హార్నిమెన్ అరాచకత్వాన్ని కోరలేదని నాకు తెలుసు. సత్యాగ్రహ సంస్థ సలహా తీసుకోకుండా పంజాబు ప్రభుత్వపు ఆదేశాన్ని నేను ధిక్కరించడం సరికాదని ఆయన భావించాడు. సహాయ నిరాకరణోద్యమాన్ని వాయిదా వేయడానికి ఆయన పూర్తిగా యిష్టపడ్డాడు. నేను వాయిదా వేస్తున్నానని ప్రకటించక పూర్వం వాయిదా వేయమని సలహాయిస్తూ ఆయన వ్రాసిన జాబు నాకు ఆలస్యంగా అందింది. అప్పటికి నా ప్రకటన వెలువడింది. ఆ ఆలస్యానికి కారణం అహమదాబాదుకు బొంబాయికి మధ్యన గల దూరమే. ఆయనను దేశాన్నుండి బహిష్కరించిన తీరు నాకు బాధ కలిగించింది. ఈ ఘట్టం జరిగిన తరువాత క్రానికల్ పత్రికను నడిపే బాధ్యత నాకు అప్పగించారు. మిస్టర్ బరేల్వీ అక్కడ వున్నారు. అందువల్ల నేను చేయవలసిన పని అంటూ ఏమీ మిగలలేదు. ఆ బాధ్యత కూడా ఎక్కువ రోజులు వహించవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వంవారి దయ వల్ల క్రానికల్ ప్రచురణ ఆగిపోయంది. క్రానికల్ వ్యవస్థను చూస్తున్న ఉమర్‌సుభానీ, శంకర్‌లాల్ బాంకర్‌గారలు “యంగ్ ఇండియా” వ్యవస్థ కూడా చూస్తున్నారు. వారిద్దరూ యంగ్ ఇండియా బాధ్యత వహించమని నన్ను కోరారు. క్రానికల్ లేని లోటు తీర్చడం కోసం యంగ్ ఇండియా పత్రికను వారానికి ఒకసారి గాకుండా రెండు సార్లు ప్రచురించాలని నిర్ణయించాం.

ప్రజానీకానికి సత్యాగ్రహ రహస్యాలు తెలియచేయాలనే కాంక్ష నాకు వున్నది. పంజాబును గురించి ఏమీ చేయలేకపోయాను. కనీసం విమర్శించవచ్చు కదా! దాని వెనుక సత్యాగ్రహస్ఫూర్తి వున్నదని గవర్నమెంటుకు తెలుసు. అందువల్ల ఆ మిత్రుల సలహాను అంగీకరించాను. కాని ఇంగ్లీషు ద్వారా ప్రజానీకానికి సత్యాగ్రహాన్ని గురించి శిక్షణ ఎలా గరపడం? నా కార్యక్షేత్రం ముఖ్యంగా గుజరాత్ ప్రాంతం. సోదరుడు ఇందూలాల్ యాజ్ఞిక్ అప్పుడు యీ మండలిలో ఉన్నారు. ఆయన చేతిలో మాసపత్రిక నవజీవన్ వున్నది. ఆ ఖర్చు కూడా పై మిత్రులే భరిస్తున్నారు. ఆ పత్రికను ఇందూలాల్ మరియు ఆ మిత్రులు నాకు అప్పగించారు. అయితే అందు పని చేయడానికి