పుట:సత్యశోధన.pdf/428

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
405
 

ఆ సంస్థకు నేనే అధ్యక్షుణ్ణి. చదువుకున్న వర్గం వారికి, నాకు అంతగా పొసగదని తేల్చుకున్నాను. కరపత్రాల్లో గుజరాతీ భాషనే వాడాలని చెప్పాను. యిలాంటివే మరికొన్ని విషయాలు వాళ్లను గొడవలో పడవేశాయి. అయినా చాలామంది నా పద్ధతి ప్రకారం నడిచేందుకు సిద్ధపడి తమ ఉదారబుద్ధిని చాటుకున్నారు. అయితే యీ సభ ఎక్కువ రోజులు నడవదని ప్రారంభంలోనే గ్రహించాను. పని మాత్రం బాగా పెరిగిపోయింది. 

30. అద్భుతమైన దృశ్యం

రౌలట్ కమిటీ రిపోర్టుకు వ్యతిరేకంగా ఒకవైపున ఉద్యమం సాగుతూ వుంటే మరోవైపున ప్రభుత్వం ఆ రిపోర్టును అమలుపరిచి తీరాలనే నిర్ణయానికి వచ్చింది. రౌలట్ బిల్లు వెలువడింది. నేను కౌన్సిలు మీటింగులో రౌలట్ బిల్లు మీద జరిగే చర్చ విందామని ఒకసారి వెళ్లాను. శాస్త్రిగారి ఉపన్యాసం మహావేడిగా సాగుతున్నది. ఆయన గవర్నమెంటును గట్టిగా హెచ్చరిస్తున్నారు. శాస్త్రిగారి మాటలు జోరుగా సాగుతూ వుంటే వైస్రాయి ఆయన ముఖం వంక శ్రద్ధగా చూస్తూ వున్నాడు. శాస్త్రి గారి మాటల ప్రభావం ఆయన మీద బాగా పడివుంటుందని అనుకున్నాను. శాస్త్రి గారి భావావేశం బాగా పొంగిపొర్లుతూ వుంది.

నిద్రపోతున్నవాణ్ణి మేల్కొల్పవచ్చు. కాని మేల్కొనివుండి నిద్రపోతున్నట్లు నటించేవాడి చెవి దగ్గర శంఖం ఊదినా ప్రయోజనం ఏముంటుంది? కౌన్సిల్లో బిల్లుల మీద చర్చ జరిగినట్లు పెద్ద నాటకం ఆడాలికదా! ప్రభుత్వం ఆ పని చేసింది. అయితే తను అనుకున్నట్లే చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. అందువల్ల శాస్త్రిగారిది అంతా కంఠశోష అని తేలిపోయింది. ఇక ఆ సందట్లో నామాట వినేవాడెవరు? వైస్రాయిని కలిసి అనేక విధాల చెప్పాను. జాబులు వ్రాశాను. బహిరంగ లేఖలు కూడా వ్రాశాను. సత్యాగ్రహం తప్ప గత్యంతరం లేదని కూడా ప్రకటించాను. అంతా అడవిలో గాచిన వెన్నెల చందాన అయిపోయింది.

ఇంకా బిల్లు గెజట్లో ప్రకటించబడలేదు. నా శరీరం బలహీనంగావుంది. అయినా పెద్ద పోరాటానికి నడుం బిగించాను. పెద్ద ప్రసంగాలు చేసే శక్తి ఇంకా నాకు చేకూరలేదు. నిలబడి మాట్లాడగల శక్తి ఎప్పుడో పోయింది. ఆ శక్తి ఇక యీనాటివరకు నాకు చేకూరలేదు. నిలబడి కొద్ది సేపు మాట్లాడితే శరీరం వణికిపోవడం, గుండెలో నొప్పి యిదీ వరస. అయితే మద్రాసు నుండి అందిన ఆహ్వానం అంగీకరించాలని భావించాను.