పుట:సత్యశోధన.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

404

రౌలట్ ఆక్టు - ధర్మసంకటం

మేకపాలు తాగడం ప్రారంభించిన కొద్ది రోజుల తరువాత డా. దలాల్ మలద్వారం దగ్గర పడ్డ గాట్లకు శస్త్రచికిత్స చేశారు. దానితో గాట్లు సర్దుకున్నాయి. ఇప్పుడు లేవగలననే ఆశ కలిగింది. పత్రికలు చదవడం ప్రారంభించాను. ఇంతలో రౌలట్ కమిటీ రిపోర్టు నా చేతికి అందింది. అందు పేర్కొన్న సిఫారసులను చదివి నివ్వెరబోయాను. ఉమర్‌భాయి (సుభానీ), శంకరలాల్ యీ విషయమై గట్టి చర్య తీసుకోవాలని అన్నారు. ఒక నెల రోజులు గడిచిన తరువాత నేను అహమదాబాదు వెళ్లాను. వల్లభభాయి ప్రతి రోజు నన్ను చూచేందుకు వస్తూ వుండేవారు. వారితో మాట్లాడి దీన్ని గురించి ఏమైనా చేయాలి అని అన్నాను. “ఏం చేయాలి?” అని ప్రశ్నించారు వల్లభభాయి. కమిటీ చేసిన సిఫారసుల ప్రకారం చట్టం చేయబడితే వెంటనే సత్యాగ్రహం ప్రారంభించాలి. అలా చేస్తామని ప్రతిజ్ఞ గైకొనేవారు కొందరైనా అవసరం అని చెప్పాను. నేను మంచం పట్టి వుండకపోతే ఒంటరిగానే పోరాటానికి దిగేవాణ్ణి. తరువాత కొంతమంది అయినా పోరాటంలో చేరేవారు. శరీర దారుఢ్యత లేనందువలన ఒంటరిగా పోరాటానికి దిగగల శక్తి నాకు లేదు అని చెప్పాను.

ఈ సంభాషణ జరిగిన తరువాత నాతో బాటు పని చేస్తూ వున్న వారి సమావేశం ఒకటి ఏర్పాటు చేశాను. రౌలట్ కమిటీ చేసిన సిఫారసులు, వాటికి సంబంధించిన చట్టాలు అన్నీ అనవసరం అని నాకు తోచింది. అభిమానం గల ఏ దేశమూ యిట్టి చట్టాల్ని అంగీకరించదని స్పష్టంగా తేలిపోయింది. సమావేశం జరిగింది. 20 మంది మాత్రమే ఆహ్వానించబడ్డారు, వల్లభభాయి గాక శ్రీమతి సరోజినీ నాయుడు, హార్నిమెన్, కీ.శే ఉమర్ సుభాని, శంకర్ లాల్ బాంకరు, అనసూయా బెన్ వారిలో వున్నారని నాకు బాగా గుర్తు. ప్రతిజ్ఞాపత్రం తయారుచేయబడింది. అక్కడ వున్నవారంతా దాని మీద సంతకాలు చేశారని నాకు జ్ఞాపకం. అప్పటికి నేను పత్రికా ప్రచురణ ప్రారంభించలేదు. కాని పత్రికలకు వ్యాసాలు వ్రాస్తూవుండేవాణ్ణి. శంకర్ లాల్ బాంకరు ఉద్యమం ప్రారంభించాడు. ఆయన శక్తి సామర్థ్యాలు అప్పుడు నాకు బాగా బోధపడ్డాయి. సత్యాగ్రహాన్ని మించిన మరో క్రొత్త ఆయుధ ప్రయోగం ఎవరైనా ప్రారంభిస్తారనే నమ్మకం నాకు కలగలేదు. అందువల్ల సత్యాగ్రహ సభ ఏర్పాటు చేయబడింది. ముఖ్యమైన పేర్ల పట్టిక బొంబాయిలోనే తయారైంది. అందుకు కేంద్రం బొంబాయి నగరమే. ప్రతిజ్ఞాపత్రం మీద ఎక్కువమంది సంతకాలు చేయసాగారు. ఖేడా సంగ్రామంలో వలె యిక్కడ కూడా కరపత్రాలు వెలువడ్డాయి. అనేక చోట్ల సభలు జరిగాయి.