పుట:సత్యశోధన.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

403

వరకు నేను మీ శరీరాన్ని బాగుచేయలేను. మీ శరీరం బాగుపడాలంటే పాలు త్రాగక తప్పదు. ఆర్సెనిక్ ఇంజెక్షన్లు చేయించుకోవాలి. మీరు సరేనంటే మీ శరీర బాధ్యత నాది’ అని అన్నారు. “ఇంజెక్షన్లు తీసుకుంటాను కాని పాలు మాత్రం త్రాగను”. “పాలను గురించిన మీ ప్రతిజ్ఞ ఏమిటి?” ఆవులను గేదెలను నరకయాతనలకు గురిచేస్తారని తెలిసి పాలంటే నాకు ఏవగింపు కలిగింది. పాలను ఆహారంగా తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చాను. అందువల్ల పాలు త్రాగడం మానివేశాను”. “అయితే మేకపాలు తీసుకోవచ్చు గదా!” అని నా మంచం దగ్గరే నిలబడి వున్న కస్తూరిబాయి అన్నది. “మీరు మేకపాలు పుచ్చుకున్నా చాలు” అని అన్నాడు డాక్టరు. నేను ఓడిపోయాను. సత్యాగ్రహ సంగ్రామపు మోహం జీవించాలనే లోభాన్ని కలిగించిందన్న మాట. ప్రతిజ్ఞను అక్షరశః పాటిస్తున్నానని సంతోషపడి దాని ఆత్మకు హాని కలిగించాను. పాలు త్రాగను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు నాదృష్టిలో వున్నది ఆవులు గేదెలు మాత్రమే. అయినా పాలు అంటే అన్నిరకాల పాలు అని అర్థం కదా! జంతువుల పాలు ఆహారంగా తీసుకోకూడదు అని నేను భావించాను గనుక ఏవిధమైన పాలు నేను పుచ్చుకోకూడదు కదా! యీ విషయం తెలిసి కూడా నేను మేకపాలు పుచ్చుకునేందుకు సిద్ధపడ్డాను. సత్యాన్ని పూజించే వ్యక్తి సత్యాగ్రహ సంగ్రామం జరపడం కోసం జీవించాలనే కాంక్షతో అసలు సత్యాన్ని అణచివేసి దానికి మచ్చ తెచ్చాడన్న మాట.

నేను చేసిన యీ పని నాకు బాధ కలిగించింది. ఆ బాధ ఆ గాయం యింకా మానలేదు. మేకపాలు మానివేయాలి అను యోచన నాకు కలుగలేదు. మేకపాలు రోజూ త్రాగుతూ వున్నప్పుడు లోలోన బాధపడసాగాను. అయితే సేవ చేయాలనే అతిసూక్ష్మమైన మోహం నన్ను పట్టుకున్నది. అది నన్ను వదలలేదు. అహింసా దృష్టితో ఆహార ప్రయాగాలు చేయడం నాకు యిష్టం. అందువల్ల నా మనస్సుకు ఆహ్లాదం చేకూరుతుంది. కాని మేకపాలు తాగడం మాత్రం సత్యశోధన దృష్ట్యా నాకు యిష్టంలేదు. అహింస కంటే కూడా సత్యాన్ని ఎక్కువగా తెలుసుకోగలిగానని నా భావం. సత్యాన్ని త్యజిస్తే అహింస ద్వారా సమస్యల్ని పరిష్కరించలేనని నా విశ్వాసం. సత్య పాలన అంటే మాటను పాటించడం. శరీరం, ఆత్మ రెండిటిని రక్షించడం. శబ్దార్ధం మరియు భావార్ధం రెండిటినీ దెబ్బ తీశానన్నమాట. ప్రతి క్షణం యీ బాధ నన్ను బాధిస్తూనే వుంది. విషయాలు అన్నీ తెలిసినప్పటికీ అసలు విషయం నేను పూర్తిగా తెలుసుకోలేదన్నమాట లేక దాన్ని పాటించే ధైర్యం నాకు చాలలేదని కూడా చెప్పవచ్చు. “ఓ భగవంతుడా! నాకు అట్టి ధైర్యం ప్రసాదించు!”