పుట:సత్యశోధన.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

366

బీహారీల అమాయకత్వం

బాబూ రాజేంద్ర ప్రసాదుకు తంతి పంపాము. వాళ్లిద్దరూ వస్తారు మీకు విషయమంతా చెబుతారు. సాయం చేస్తారు. దయయుంచి మీరు గయాబాబు గారింటికి బయలుదేరండి” అని అన్నారు. ఈ మాటలు విని నేను మెత్తబడ్డాను. నేను బసచేస్తే గయాబాబుగారికి యిబ్బంది కలుగుతుందేమోనని సంకోచించాను. కాని గయాబాబు సంకోచించవద్దని నాకు చెప్పారు. నేను గయాబాబు గారింటికి వెళ్లాను. వారు, వారి కుటుంబంలోని వారు నన్ను ప్రేమ జల్లుతో తడిపివేశారు.

ప్రజకిషోర్ బాబు దర్భంగా నుండి వచ్చారు. రాజేంద్రబాబు పూరీ నుండి వచ్చారు. లక్నోలో నేను చూచిన ప్రజకిషోర్ బాబు సామాన్యుడు కాదని తేలింది. బీహారు ప్రజలకుండే సహజ వినమ్రత, సాదాతనం, మంచి మనస్సు, అసాధారణమైన శ్రద్ధ వారిలో చూచి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. బీహారు వకీళ్లు వారి యెడ చూపించిన ఆదరం నాకు ఆశ్చర్యం కలిగించింది.

ఆ మండలి సభ్యులకు నాకు మధ్య ఏర్పడ్డ ప్రేమబంధం జీవితాంతం విడిపోకుండా నిలిచిపోయింది. ప్రజకిషోర్‌బాబు అక్కడ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పారు. ఆయన బీదరైతుల పక్షాన కోర్టుల్లో వాదిస్తున్నారని, రెండు మూడు కేసులు అట్టివి నడుస్తున్నాయని, ఆ కేసుల్లో వాదించి వ్యక్తిగతంగా కొంత ఊరట చెందుతూ వున్నారని తెలుసుకున్నాను. అప్పుడప్పుడు అందు ఓడిపోతూ వుంటారట. అమాయకులైన ఆ రైతుల దగ్గర సామ్ము తీసుకుంటూ వుంటారట. త్యాగులే అయినా ప్రజకిషోర్‌బాబు, రాజేంద్రప్రసాద్‌లు కక్షిదారులగు రైతుల దగ్గర ధనం తీసుకుంటూ వుంటారని, అందుకు సంకోచించరనీ తెలిసింది. వృత్తిపరంగా డబ్బు తీసుకోకపోతే మా ఇంటి ఖర్చులకు డబ్బు ఎలా వస్తుందని వారి తర్కం. అట్టి డబ్బుతోనే సమాజ సేవ కూడా చేయగలుగుతున్నామని చెప్పారు. వారికి లభించే సొమ్ముకు, బెంగాల్ బీహారుకు చెందిన మిగతా బారిష్టర్లకు లభించే సొమ్ముకు గల ఊహకైనా అందని వ్యత్యాసాన్ని అంకెల రూపంలో తెలుసుకుని నివ్వెరబోయాను.

“బాబు గారికి మేము ఒపీనియన్ (అభిప్రాయం) కోసం పదివేలు యిచ్చాం.” అని జనం చెబుతూ వుంటే ఆశ్చర్యం వేసింది. వెయ్యికి తక్కువ మాట నాకు వినబడలేదు. ఈ విషయంలో నేను తియ్యగా ఆ మిత్రమండలిని మందలించాను. ఓర్పుతో నా మందలింపును వారు సహించారు. విపరీతార్థాలు తియ్యలేదు. అంతా విన్న తరువాత “ఇక యిట్టి కేసులు మనం విరమించుకోవాలి. యీ విధమైన కేసుల