పుట:సత్యశోధన.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

354

లక్ష్మణ ఊయల

విషయమై మీ మాటలు నాకు మింగుడుపడవు. కాని పిలక విషయమై మీరు చెప్పిన మాటల్ని గురించి యోచిస్తాను. మొదట పిలక నాకు వుండేది. కాని సిగ్గువల్ల అంతా నవ్వుతారేమోననే భావంతో నేనే తొలగించి వేశాను. దాన్ని తిరిగి పెట్టుకోవడం మంచిదని నాకు తోస్తున్నది. నా అనుచరులతో యీ విషయమై నేను మాట్లాడుతాను అని చెప్పాను. స్వామికి జందెం గురించి నేను అన్న మాటలు నచ్చలేదు. నేను ధరించకూడదు అని చెబుతూ చెప్పిన కారణాలు, ధరించవచ్చును అని చెప్పుటకు అనుకూలమని ఆయనకు తోచాయి. అయితే ఋషీకేశంలో జందాన్ని గురించి నేను చెప్పిన మాటల పై యిప్పటికీ నేను నిలబడివున్నాను. వేరు వేరు మతాలు వున్నంతవరకు ఆ మతాలవారికి బాహ్యచిహ్నాలు బహుశా అవసరం అవుతాయి. కాని ఆ బాహ్యచిహ్నాలు ఆడంబరంగా మారినప్పుడు, తన మతమే యితర మతాల కంటే గొప్పదని చెప్పుటకు సాధనాలుగా మారినప్పుడు వాటిని త్యజించడం మంచిది. యిప్పుడు జందెం హిందూ సమాజాన్ని ఉన్నత స్థాయికి గొంపోవుటకు సాధనమను విశ్వాసం నాకు కలుగలేదు. అందువల్ల దాని విషయంలో తటస్థంగా వున్నాను. కాని పిలక జుట్టు తీసివేసిన కారణాలను తలచుకుంటే నాకే సిగ్గువేస్తున్నది. అందువల్ల అనుచరులతో చర్చించి పిలక పెట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చాను.

ఇక మనం లక్ష్మణ ఉయ్యాల దగ్గరకు వెళదాం. ఋషికేశం మరియు లక్ష్మణ ఝూలా దగ్గరి ప్రకృతి దృశ్యాలు ఎంతో రమణీయంగా వున్నాయి. ప్రకృతి శోభను, ప్రకృతి యొక్క శక్తిని గుర్తించగల మన పూర్వీకుల సామర్థ్యాన్ని, ఆ శోభకు ధార్మిక స్థాయి కల్పించగల స్తోమతను, వారి దూరదృష్టిని చూచి నా హృదయం శ్రద్ధాభక్తితో నిండిపోయింది. కాని అక్కడ మనిషి చేసిన నిర్మాణ వ్యవహారం చూచి నా మనస్సుకు అశాంతి కూడా కలిగింది. హరిద్వారంలోనే గాక, ఋషికేశంలో కూడా జనం పరిశుద్ధమైన నదీ తీరాన్ని మలమూత్రాదులతో పాడు చేస్తున్నారు. తప్పు చేస్తున్నామనే భావం కూడా వారికి లేదు. దొడ్డికి వెళ్లదలచినవారు దూరం పోవచ్చుగదా! జనం తిరిగే చోటనే మలమూత్రాదులు విసర్జిస్తున్నారు. యిది చూచి మనస్సుకు బాధ కలిగింది. లక్ష్మణ ఉయ్యాల దగ్గరకు వెళ్లగా ఇనుప ఉయ్యాల కంటపడింది. మొదట యీ వంతెన త్రాళ్లతో కట్టబడి వుండేదని, దాన్ని తెగగొట్టి ఒక ఉదార హృదయుడగు మార్వాడీ ఎంతో ధనం వెచ్చించి ఇనుముతో వంతెన తయారుచేయించి దాని తాళం చెవి ప్రభుత్వం వారికి అప్పగించాడని జనం చెప్పారు. త్రాళ్ళ వంతెనను గురించి నేను ఊహించలేదు కాని యీ ఇనుప వంతెన మాత్రం యిక్కడి సమాజ శోభను కలుషితం చేస్తున్నదని