పుట:సత్యశోధన.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

355

చెప్పగలను. చూడటానికి అసహ్యంగా వున్నది. జనం నడిచే మార్గపు తాళం చెవి ప్రభుత్వానికి అప్పగించారని విని బాధపడ్డాను. ప్రభుత్వం యెడ విశ్వాసం కలిగియున్న ఆనాటి నా మనస్తత్వానికి కూడా ఆ విషయం తెలిసినప్పుడు బాధ కలిగింది.

కొంచెం ముందుకు వెళ్లగా అక్కడ స్వర్ణాశ్రమం కనబడింది. దాని పరిస్థితి ఘోరంగా వున్నది. టిన్ను రేకులతో కప్పబడి వున్న పందిరి గుడిశల్లాంటి గదులకు స్వర్ణాశ్రమం అని పేరు పెట్టారు. యీ గదులు సాధన చేసేవారి కోసం నిర్మించబడ్డాయని చెప్పారు. ఇప్పుడు ఆ గదుల్లో ఒక్క సాధకుడు కూడా లేడు. వాటిని అంటి పెట్టుకొని కొన్ని మేడలు వున్నాయి. వాటిలో వుండేవారిని చూచాక వారి ప్రభావం కూడ నా మీద ఏమీ పడలేదు.

మొత్తం మీద హరిద్వార్‌లో కలిగిన అనుభవాలు నా దృష్టిలో అమూల్యాలు. వాటి ప్రభావం నా మీద బాగా పడింది. నేను ఎక్కడ వుండాలో, ఏం చేయాలో నిర్ణయించుకునేందుకు హరిద్వార్‌లో కలిగిన అనుభవాలు నాకు అమితంగా తోడ్పడ్డాయి. 

9. ఆశ్రమ స్థాపన

ది. 25 మే 1915 నాడు సత్యాగ్రహ ఆశ్రమ స్థాపన జరిగింది. హరిద్వార్‌లో వుండమని శ్రద్ధానందగారు చెప్పారు. వైద్యనాదదామంలో వుండమని కలకత్తాకు చెందిన కొందరు మిత్రులు సలహా ఇచ్చారు. రాజకోటలో వుండమని కొందరు మిత్రులు కోరారు. ఒకసారి అహమదాబాదు వెళ్లాను. చాలామంది మిత్రులు అహమదాబాదులో వుండమని చెప్పారు. ఆశ్రమానికి అయ్యే ఖర్చంతా భరిస్తామని చెప్పి ఇల్లు వెతికి పెట్టే బాధ్యత కూడా వహిస్తామని మాట యిచ్చారు.

అహమదాబాదు మీద మొదటి నుండి నాకు చూపు వున్నది. నేను గుజరాతీ వాడిని, గుజరాతీ భాష ద్వారా దేశానికి ఎక్కువ సేవ చేయగలుగుతానని గ్రహించాను. చేనేతకు అహమదాబాదు కేంద్రం కావడం వల్ల అక్కడ చరఖా పని బాగా సాగుతుందనే భావం కూడా నాకు కలిగింది. గుజరాత్‌లో పెద్ద పట్టణం గనుక, యిక్కడ ధనవంతులు ఎక్కువగా వుండటం వల్ల వారి సాయం లభిస్తుందనే ఆశ కూడా కలిగింది. అహమదాబాదుకు చెందిన మిత్రులతో మాట్లాడుతూ వున్నప్పుడు అస్పృశ్యతను గురించి కూడా చర్చ జరిగింది. ఎవరైనా అంత్యజ సోదరుడు ఆశ్రమంలో చేరదలచుకుంటే