పుట:సత్యశోధన.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

హైస్కూల్లో


అక్షరాలు దిద్దించుటకు ముందు బాలురకు చిత్రలేఖనం నేర్పటం అవసరమని నాకు అనిపించింది. పూవులు, పిట్టలు మొదలుగా గల వాటిని పరిశీలించి చిత్రించినట్లే అక్షరాల్ని కూడా పరిశీలించి వ్రాయడం అవసరం. వస్తువుల్ని చూచి గీయడం నేర్చుకున్న తరవాతే వ్రాత నేర్వడం మంచిది. అప్పుడు అక్షరాలు అందంగా వుంటాయి. ఆనాటి మా బడిని గురించిన రెండు విషయాలు చెప్పవలసినవి వున్నాయి. వివాహం వల్ల నా ఒక సంవత్సర కాలం వ్యర్థమైపోయింది. దాన్ని సరిచేసేందుకు ఉపాధ్యాయుడు నన్ను పై క్లాసులో చేర్పించాడు. కష్టపడి చదివే వాళ్ళకు అట్టి అవకాశం లభిస్తూ వుండేది. అందువల్ల నేను మూడో తరగతిలో ఆరు నెలలు మాత్రమే వుండి ఎండాకాలపు సెలవులకు పూర్వం జరిగే పరీక్షలు పూర్తి అయిన తరువాత నాలుగో తరగతిలో చేర్చబడ్డాను. నాలుగో తరగతి నుండి పాఠ్య విషయాలు ఎక్కువభాగం ఇంగ్లీషులో బోధించబడేవి. నాకు నడిసముద్రంలో వున్నట్లు అనిపించేది. రేఖాగణితం నాకు క్రొత్త. ఇంగ్లీషులో రేఖాగణితం బోధించడం వల్ల నా పాలిట అది గుదిబండ అయింది. ఉపాధ్యాయుడు పాఠం బాగా చెప్పేవాడు. కాని ఏమీ బోధపడేది కాదు. పాఠాలు కష్టంగా వుండటం వలన నా మనస్సు కలత చెంది తిరిగి మూడో తరగతిలోనే చేరదామని భావించాను. రెండేండ్ల చదువు ఒక సంవత్సరంలో పూర్తి చేయడం కష్టమనిపించింది. కాని నాకంటే కూడా నా ఉపాధ్యాయునికి యిలా తిరిగి నేను మూడో తరగతిలో చేరడం అవమానమనిపించింది. నా చదువు మీద గల విశ్వాసంతో ఆయన నన్ను నాలుగో తరగతిలో చేర్పించాడు. యింతగా శ్రమపడిన తరువాత తిరిగి మూడో తరగతిలో నేను చేరడం సబబా? అందువల్ల నేను నాలుగో తరగతిలోనే ఉండిపోయాను. బాగా కష్టపడి చదవడం ప్రారంభించాను. యూక్‌లిడ్‌లో 13వ ప్రోపొజిషన్ వరకు రాగా అక్కడి నుండి రేఖాగణితం సులభంగా బోధపడిపోయింది. తెలివితేటల్ని ఉపయోగించి సరళప్రయోగాలు చేస్తూ కృషి చేస్తే ఏ విషయమైనా తప్పక బోధపడుతుంది. అప్పటినుండి నాకు రేఖాగణితం యెడ అభిరుచి పెరిగింది.

సంస్కృతం బాగా కష్టమనిపించింది. రేఖాగణితంలో బట్టీ పట్టవలసిన అవసరం వుండేది కాదు. కాని సంస్కృతం అంతా బట్టీపట్టడమే. అందుకు ధారణాశక్తి అవసరమనిపించింది. నాలుగోతరగతికి చేరేసరికి సంస్కృత పాఠాలు మరీ కష్టమనిపించాయి. సంస్కృత ఉపాధ్యాయుడు పిల్లలకు సంస్కృతాన్ని నూరిపోద్దామని అనుకునేవాడు. సంస్కృత ఉపాధ్యాయుడికీ, ఫారసీ ఉపాధ్యాయుడికీ పడేది కాదు. ఫారసీ మౌల్వీ సౌమ్యుడు. ఫారసీ తేలిక అని ఫారసీ మౌల్వీ పిల్లల్ని ప్రేమగా చూస్తాడని