పుట:సత్యశోధన.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

13

అలవాటు నన్ను వదలలేదు. కాలినడకన తిరగడం కూడా మంచి వ్యాయామమే. అందువల్ల నా శరీరంలో కొంచెం బిగువు వచ్చింది. నా తండ్రికి సేవ చేయాలనే తలంపు కూడా వ్యాయామంలో పాల్గొనకపోవడానికి మరో కారణం. స్కూలు మూసివేయగానే యింటికి చేరి తండ్రికి సేవ చేసేవాణ్ణి. స్కూల్లో వ్యాయామాన్ని అనివార్యం చేయడం వల్ల తండ్రిగారి సేవకు విఘ్నం ఏర్పడింది. గనుక స్కూలు వ్యాయామంలో పాల్గొనకుండా వుండుటకు అనుమతి నొసంగమని అర్జీ పెట్టుకున్నాను. కాని గీమీగారు అంగీకరిస్తారా? ఒక శనివారం నాడు స్కూలు ఉదయం పూట నడిపారు. సాయంకాలం మేఘాలు కమ్మాయి. అందువల్ల టైము ఎంత అయిందో తెలియలేదు. మేఘాలవల్ల మోసపోయాను. క్లాసుకు వెళ్ళాను. ఎవ్వరూ లేరు. రెండో రోజున గీమీగారు హాజరు పట్టిక చూచారు. నేను పాల్గొనలేదని తేలింది. కారణం అడిగారు నేను నిజం చెప్పాను. నేను చెప్పింది నిజం కాదని ఆయన భావించారు. ఒకటో లేక రెండో అణాల (ఎంతో సరిగా జ్ఞాపకం లేదు) జుర్మానా వేశారు. నేను అబద్ధం చెప్పలేదని రుజువు చేయడం ఎలా? ఉపాయం ఏమీ కనబడలేదు. వూరుకున్నాను. బాగా ఏడ్చాను. నిజం మాట్లాడేవారు, నిజాయితీగా వ్యవహరించేవారు. ఏమరచి వుండకూడదని గ్రహించాను. చదువుకునే రోజుల్లో అజాగ్రత్తగా వుండటం అదే ప్రధమం, అదే అంతిమం కూడా. చివరికి ఆ జుర్మానాను మాఫీ చేయించుకోగలిగానని జ్ఞాపకం. స్కూలు మూసివేయగానే నా సేవకు మా అబ్బాయి అవసరం అని మా తండ్రి హెడ్మాష్టరుకు జాబు వ్రాశారు. దానితో నాకు ముక్తి లభించింది.

వ్యాయామానికి బదులు వాహ్యాళికి వెళ్ళడం అలవాటు చేసుకున్నందువల్ల అనారోగ్యం బారినుండి తప్పించుకోగలిగాను. కాని మరో పొరపాటు వల్ల కలిగిన ఫలితం నేను ఈనాటికీ ఆనుభవిస్తున్నాను. చదువుకునేటప్పుడు అందంగా వ్రాయడం నేర్చుకోవలసిన అవసరం లేదనే తప్పు అభిప్రాయం నా బుర్రలో ఎలా దూరిందో తెలియదు దూరిపోయింది. విదేశానికి బయలుదేరేంతవరకు ఆ అభిప్రాయం మారలేదు. కాని దక్షిణాఫ్రికాకు వెళ్ళిన తరువాత, అక్కడి వకీళ్ళు అక్కడి ప్రజలు ముత్యాల్లాంటి అందమైన అక్షరాలు వ్రాస్తూ వుంటే చూచి సిగ్గుపడ్డాను. వంకరటింకర అక్షరాలు అసంపూర్ణ విద్యకు చిహ్నంగా భావించాలనే భావం అప్పుడు నాకు కలిగింది, తరువాత నా అక్షరాల్ని అందంగా వ్రాద్దామని ఎంతో ప్రయత్నించాను. కాని వ్యవహారం చేయి దాటి పోయింది. దస్తూరి మార్చుకోలేకపోయాను. నన్ను చూచి ప్రతి బాలుడు, బాలిక జాగ్రత్తపడాలని కోరుతున్నాను. మంచి దస్తూరి విద్యలో భాగమని అందరూ గుర్తించాలి.