పుట:సత్యశోధన.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

343

నాకప్పుడు తెలియదు. కాని తరువాత తెలిసింది. ఇంగ్లాండులో నేను వున్నప్పుడు అక్కడ వున్న కేశవరావు దేశాపాండే బరోడా ప్రాంతంలో గంగానాధ విద్యాలయం నడుపుతూ వుండేవారు. వారికి గల భావాల్లో విద్యాలయంలో పనిచేసేవారంతా ఒకే కుటుంబీకులుగా వుండాలన్నది ఒకటి. ఆ ఉద్దేశ్యంతో అక్కడి ఉపాధ్యాయులందరికీ ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ పద్ధతిలో కాలేల్కరు కాకా (పెదతండ్రి), అయ్యారు. ఫడకే మామ అయ్యాడు. హరిహరశర్మ అన్న అయ్యాడు. తదితరులకు కూడా తగిన పేర్లు లభించాయి. కాలేల్కర్ అనుచరుడు ఆనందనాధ్ (స్వామి), మామ మిత్రుడు పట్వర్ధన్ (అప్ప) పేర్లతో యీ కుటుంబంలో తరువాత చేరారు. యీ కుటుంబానికి చెందిన ఆ అయిదుగురు నా అనుచరులైనారు. దేశపాండే “సాహబ్” పేరట ప్రసిద్ధికెక్కారు. సాహబ్ గారి విద్యాలయం మూతబడగానే ఆ అయిదుగురు చెల్లాచెదురయ్యారు. అయినా తమ మధ్య నెలకొన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని వీరు వదులుకోలేదు. కాకా సాహబ్ పలుచోట్లకు వెళ్లి అనుభవం గడిస్తూ శాంతినికేతనంలో చేరారు. ఆ కోవకు చెందిన చింతామణి శాస్త్రి అను మరొకరు కూడా ఇక్కడే వున్నారు. వీరిద్దరు సంస్కృతం బోధిస్తూ వుండేవారు.

శాంతినికేతనంలో మా అనుచరులకు బస విడిగా ఏర్పాటుచేశారు. అక్కడ మగన్‌లాల్ గాంధీ వారి మంచి చెడ్డలు చూస్తూ వున్నాడు. ఫినిక్సు ఆశ్రమంలో పాటించిన నియమనిబంధనల్ని తాను పాటిస్తూ యితరుల చేత పాటింప చేస్తూ వున్నాడు. తన జ్ఞానం, ప్రేమ, కష్టపడి పనిచేసే మనస్తత్వంతో శాంతి నికేతనంలో సువాసనలు ఆయన విరజిమ్మటం గమనించాను. అక్కడ ఆండ్రూస్ వున్నారు. పియర్సన్ వున్నారు. జగదానందబాబు, నేపాల్ బాబు, సంతోషబాబు, క్షితిమోహనబాబు, నగేన్‌బాబు, శరద్‌బాబు, కాళీబాబు మొదలగువారితో నాకు పరిచయం ఏర్పడింది.

నా స్వభావం ప్రకారం నేను విద్యార్థులతోను, ఉపాధ్యాయులతోను కలిసిపోయి కాయకష్టం గురించి చర్చ ప్రారంభించాను. జీతం తీసుకొని పనిచేసే వంటవానికి బదులు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి వంటపని చేసుకుంటే మంచిది గదా అని నాకు అనిపించింది. అప్పుడు భోజనశాల ఆరోగ్యకరంగాను, పరిశుభ్రంగాను. ఆదర్శవంతంగాను వుంటుంది. విద్యార్థులు స్వయంపాకాన్ని గురించి ప్రత్యక్ష పాఠం నేర్చుకోగలుగుతారు. యీ విషయం ఉపాధ్యాయులకు చెప్పాను. యిద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు తల ఊపారు. కొంతమందికి యీ ప్రయోగం నచ్చింది. విద్యార్థులకు క్రొత్త విషయం సహజంగానే నచ్చుతుంది. వెంటనే వారంతా ఉత్సాహంతో ముందుకు