పుట:సత్యశోధన.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

342

శాంతినికేతనం

నేను భారత ప్రభుత్వానికి జాబు వ్రాశాను. ఉత్తరం అందినట్లు తెలియజేయటమే తప్ప వారేమీ చర్య గైకొనలేదు. లార్డ్ చేమ్స్‌ఫర్డును కలుసుకునే అవకాశం లభించినప్పుడు అనగా రెండు సంవత్సరాల తరువాత యీ వ్యవహారం మీద చర్య తీసుకున్నాడు. నేను యీ విషయం చెప్పగా లార్డ్ చేమ్స్‌ఫర్డు నివ్వెరబోయాడు. ఆయనకు బీరం గ్రామాన్ని గురించి ఏమీ తెలియదు. నా మాటలు ఓపికగా విని ఫోను చేసి అందుకు సంబంధించిన కాగితాలు వెంటనే తెప్పించుకున్నాడు. మీరు చెప్పిన విషయాలపై అధికారులు వ్యతిరేకించకపోతే తప్పక పన్నుల వసూళ్లను నిలిపి వేస్తానని మాట యిచ్చాడు. తరువాత కొద్ది రోజులకే పన్ను వసూళ్లు రద్దు చేశారని పత్రికల్లో చదివాను.

ఈ విజయం సత్యాగ్రహ విజయానికి పునాది అని భావించాను. అందుకు కారణం పున్నది. బొంబాయి ప్రభుత్వ సెక్రటరీ బీరం గ్రామ పన్నును గురించి మాట్లాడుతూ మీరు యీ విషయమై బగ్‌సరాలో చేసిన ప్రసంగపాఠం నాదగ్గర వున్నది. అందు మీరు సత్యాగ్రహం విషయం కూడా ఎత్తారు అని అంటూ “మీరు చేసింది బెదిరింపు కాదా? శక్తి సామర్థ్యాలుగల ఏ ప్రభుత్వమైనా యిలాంటి బెదిరింపులకు తలవంచుతుందా?” అని ఆయన నన్ను ప్రశ్నించాడు.

ఆయన ప్రశ్నకు సమాధానం యిస్తూ “ఇది బెదిరింపు కాదు. ప్రజాశిక్షణ, ప్రజలకు వారి కష్టాల్ని తొలగించుకునేందుకు అవలంబించవలసిన చర్యలను గురించి చెప్పడం నా ధర్మం. స్వాతంత్ర్యం కోరే ప్రజల దగ్గర తమ రక్షణకు అవసరమైన సాధనాలు కూడా వుండటం అవసరం. సాధారణంగా యిట్టి సాధనాలు హింసాపూరితంగా వుంటాయి. కాని సత్యాగ్రహం పూర్తిగా అహింసతో కూడిన సాధనం. దాని ఉపయోగాన్ని గురించి, దాని ప్రయోగాన్ని గురించి తెలియజేయడం నా కర్తవ్యం. ఆంగ్ల ప్రభుత్వం శక్తివంతమైనది. అందు నాకు సందేహం లేదు. అయితే సత్యాగ్రహం సర్వోన్నతమైన ఆయుధం. యీ విషయమై నాకెట్టి సందేహమూ లేదు” అని చెప్పాడు. ఆ సెక్రటరీ చతురుడు. “మంచిది చూద్దాం” అని అంటూ తల ఊపాడు. 

4. శాంతినికేతనం

రాజకోటనుండి శాంతినికేతనం వెళ్లాను. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రేమ జల్లులతో నన్ను తడిపివేశారు. స్వాగత విధానంలో సాదాతనం, కళ, ప్రేమ మూడింటి సుందర సమన్వయం కనబడింది. అక్కడే కాకాసాహెబ్ కాలేల్కర్‌ను మొదటిసారి కలుసుకున్నాను. అందరూ కాలేల్కరును కాకాసాహబ్ అని ఎందుకంటారో