పుట:సత్యశోధన.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

327

ముందు ముందు చలి మరీ తీవ్రం అవుతుంది. యిక మీరు మీ దేశం వెళ్ళండి. జబ్బు నయం అవుతుంది. అని గట్టిగా చెప్పాడు. అప్పటి వరకు యుద్ధం సాగుతూ వుంటే మీకు అందు పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇక్కడ మీరు చేసిన సహకారం తక్కువైంది కాదు” అని అన్నాడు. ఆయన సలహా అంగీకరించి హిందూ దేశానికి బయలుదేరాను. 

43. ప్రయాణం

కేలెన్‌బెక్ నాతోబాటు హిందూ దేశానికి బయలుదేరారు. ఇంగ్లాండులో మేము కలిసే వున్నాం. కాని యుద్ధం కారణంగా జర్మను దేశస్థుల మీద నిఘా ఎక్కువైంది. అందువల్ల కేలన్‌బెక్ రాకను గురించి మాకు సందేహం కలిగింది. వారికి పాస్‌పోర్టు సంపాదించేందుకు నేను చాలా ప్రయత్నం చేశాను. మి. రాబర్ట్స్ ఆయనకు పాస్‌పోర్టు యిప్పించేందుకు సిద్ధపడ్డారు. ఆయన యీ వివరమంతా మెయిల్ ద్వారా వైస్రాయికి తెలియజేశారు. కాని లార్డ్‌హార్డింగ్ దగ్గర నుంచి “ఈ సమయంలో నేనీ ప్రమాదకరమైన పనికి సహకరించలేనని తెలుపుటకు చింతిస్తున్నాను. అంటూ ఠపీమని సమాధానం వచ్చింది. ఈ సమాధానమందలి ఔచిత్యాన్ని మేమంతా గ్రహించాము. కేలన్‌బెక్‌ను వదులుతున్నప్పుడు నాకు వియోగ బాధ అమితంగా కలిగింది. కేలన్‌బెక్‌కు కలిగిన దుఃఖం వర్ణనాతీతం. ఆయన హిందూ దేశం వచ్చి వుంటే మంచి రైతుగా, మంచి నేతవానిగా సాదాజీవితం గడుపుతూ ఉండేవారు. ఇప్పుడు ఆయన దక్షిణాఫ్రికాలో శేషజీవితం గడుపుతూ వున్నారు. గృహనిర్మాణానికి సంబంధించిన వృత్తిని చేపట్టి దాన్ని బాగా సాగిస్తున్నారు. మూడోతరగతి టిక్కెట్టుపై ప్రయత్నించాము.

మేము ఓడ ప్రయాణానికి పి. అండ్ ఓ. ఓడలో మూడోతరగతి టిక్కెట్టు తీసుకున్నాము. దక్షిణ ఆఫ్రికానుంచి తెచ్చుకున్న కొన్ని ఆహార పదార్థాలు వెంట పెట్టుకున్నాం. మరో పదార్థాలు దొరుకుతాయి కాని అవి ఓడలో దొరకవు. డా. మెహతా నాశరీరాన్ని మీడ్జ్ ప్లాస్టరుతో కట్టివేశాడు. దాన్ని అలాగే వుంచమని సలహా యిచ్చాడు. రెండు రోజులు దాన్ని భరించాను. కాని యిక తట్టుకోలేక పోయాను. కొద్దిగా శ్రమపడి దాన్ని ఊడదీసి స్నానం చేశాను. ఎండు ద్రాక్ష, తాజా పండ్లు మాత్రం తీసుకుంటూ వున్నాను. ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుట పడసాగింది. ఓడ సూయజ్ కాలువలోకి ప్రవేశించునప్పటికి నా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. నీరసంగా వున్నప్పటికీ నన్ను పట్టుకున్న భయం వదిలింది. రోజురోజుకీ వ్యాయామం పెంచుతూ వున్నాను. ఈ మార్పుకు కారణం పరిశుద్ధమైన శీతోష్ణస్థితియేయని నాకు బోధపడింది.