పుట:సత్యశోధన.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

326

నొప్పి తగ్గేందుకు

కొద్దిగా కుదుటపడింది. అయితే పూర్తిగా కుదుటపడలేదు. అప్పుడప్పుడు లేడీ సిసిలియా రాబర్ట్స్ నన్ను చూచేందుకు వస్తూ వుండేది. నా చేత పాలు త్రాగించాలని ఆమె భావించింది. నేను త్రాగనని తెలుసుకొని అట్టి గుణాలు గల పదార్ధాలు మరేమైనా వున్నాయా అని అన్వేషణ ప్రారంభించింది. మాల్టెడ్‌మిల్కును గురించి మిత్రుడు తెలిపి అందుపాలు కలవవని సరిగా తెలుసుకోకుండానే ఆమెకు చెప్పాడు. అది రసాయన పదార్ధంతో తయారు చేయబడ్డ పాలగుణం కలిగిన గుజ్జు. ఆమెకు నా నిర్ణయం యెడ అపరిమితమైన ఆదరం కలదని నాకు తెలుసు. అందువల్ల ఆమె తెచ్చిన ఆ గుజ్జును నీళ్ళలో కలిపి పుచ్చుకున్నాను. పాలరుచి పూర్తిగా అందువున్నది. ఎడం చేతికి బదులు పుర్ర చెయ్యి పెట్టు అన్నట్లున్నది యీ తతంగం. సీసామీదగల చీటి చదివాను. పాలతో తయారుచేయబడిన వస్తువు అని స్పష్టంగా అందు వ్రాసివున్నది. అందువల్ల ఒక్క సారి వాడి దాన్ని మానవలసి వచ్చింది. ఈ విషయం లేడీ రాబర్ట్స్‌నుకు జాబుద్వారా తెలిపి ఏమీ అనుకోవద్దని వ్రాశాను. ఆమె వెంటనే పరుగెత్తుకు వచ్చి జరిగిన దానికి మన్నించమని కోరింది. ఆమె మిత్రుడు అసలు లేబులు చదవనేలేదన్నమాట. మీ వంటి మంచి మనస్సు గల సోదరి ఆప్యాయతతో అందజేసిన వస్తువును వదిలినందుకు క్షమించమని ఆమెను వేడుకున్నాను. తెలియక ఒక్క పర్యాయం పుచ్చుకున్నందుకు పశ్చాత్తాపపడమని, ప్రాయశ్చిత్తం చేసుకోనని కూడా ఆమెకు తెలియచేశాను.

ఆమె వల్ల కలిగిన మధురస్మృతులు యింకా వున్నాయి. కాని వాటిని వదిలి వేస్తున్నాను. ఆపదలో సాయపడ్డ యిటువంటిస్మృతులు అనేకం వున్నాయి. భగవంతుడు దుఃఖమనే చేదు మందులు త్రాగించి వాటితో పాటు తీయని స్నేహమనే పథ్యం కూడా రుచి చూపుతాడని శ్రద్ధాళువులు గ్రహింతురుగాక. డాక్టర్ ఎలిన్సన్ నన్ను చూచేందుకు రెండోసారి వచ్చారు. యీ సారి ఎక్కువ స్వాతంత్ర్యం యిచ్చారు. నునుపుతనంగల ఎండు ద్రాక్ష, వేరుశెనగపప్పుతో తయారయ్యే వెన్న తీసుకోమని చెప్పారు. పచ్చికూరలు రుచించకపోతే ఉడకబెట్టి అన్నంలో కలిపి తినమని చెప్పారు. ఆహారంలో ఈ మార్పు నా ఒంటికి బాగా పనిచేసింది.

కాని నొప్పి మాత్రం పూర్తిగా తగ్గలేదు. డాక్టర్ మెహతా అప్పుడప్పుడు వచ్చి చూచి వెళుతూ వున్నారు. “నేను చెప్పిన ప్రకారం చికిత్స చేయించుకుంటే తక్షణం నయం చేస్తా” అని ఆయన ఎప్పుడూ అంటూ వుండేవాడు. ఒకనాడు మి. రాబర్ట్స్ వచ్చి ఇండియా వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఈ పరిస్థితిలో మీరు నేటలీ వెళ్లడం కష్టం.