పుట:సత్యశోధన.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

313

ఈ విధంగా రైల్లో మనస్సును శాంతపరచుకుని నేను ఫినిక్సు చేరాను. వివరాలన్నీ తెలుసుకున్నాను. నా ఉపవాసంవల్ల అందరికీ కష్టం కలిగినా వాతావరణం మాత్రం శుద్ధి పడిందని చెప్పగలను. పాపపు భయంకర స్వరూపం ఏమిటో అందరికీ బోధపడింది. విద్యార్థులకు, విద్యార్థినులకు, నాకు మధ్యగల సంబంధం గట్టిపడింది. కొంతకాలం తరువాత మరోసారి నేను 14 రోజులు ఉపవాసం చేయవలసి వచ్చింది. అందుకు ఊహించిన దానికంటే ఎక్కువ సత్ఫలితం చేకూరింది.

ఈ వ్యవహారం దృష్ట్యా ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి సంరక్షకుడు ఇలాగే చేయాలని మాత్రం నేను అనను. కొన్ని కొన్ని సందర్భాలలో యిట్టి ఉపవాసాదులకు అవకాశం కలదని చెప్పగలను. అయితే అందుకు వివేకం, అర్హత అవసరం. ఉపాధ్యాయునికి విద్యార్థికీ మధ్య శుద్ధమైన ప్రేమలేనప్పుడు విద్యార్థి చర్యవల్ల ఉపాధ్యాయుని హృదయానికి నిజమైన దెబ్బతగలనప్పుడు, విద్యార్థికి ఉపాధ్యాయుని గౌరవభావం లేనప్పుడు ఇట్టి ఉపవాసాదులు వ్యర్ధం. నష్టం కూడా కలిగించవచ్చు. ఏది ఏమైనా ఉపవాసాదులు వహించినా వహించకపోయినా ఇట్టి విషయాలలో ఉపాధ్యాయునికి బాధ్యత ఉండి తీరుతుందని నా నిశ్చితాభిప్రాయం. ఏడురోజుల ఉపవాసం, నాలుగున్నరమాసాల ఒంటిపూట భోజనవ్రతంవల్ల మాకెవ్వరికీ యిబ్బంది కలుగలేదు. నా పనియేదీ ఆగలేదు. మందగించలేదు. అప్పుడు నేను పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకున్నాను. అయితే ఆ తరువాత చేసిన 14 రోజుల ఉపవాస సమయంలో చివరి రోజుల్లో మాత్రం కష్టం కలిగింది. అప్పటికి రామనామస్మరణ యందలి మహిమను పూర్తిగా నేను గ్రహించలేదు కాబోలు. సహనశక్తి తగ్గింది. ఉపవాస సమయంలో నీరు బాగా త్రాగాలి అను విషయం నాకు తెలియదు. అందువల్ల కూడా ఉపవాస సమయంలో బాధకలిగింది. అంతకు పూర్వం చేసిన ఉపవాసాలు ప్రశాంతంగా సాగటంవల్ల 14 రోజుల ఉపవాసం గురించి తేలికగా వ్యవహరించాను. మొదటి ఉపవాససమయంలో కూనేగారి కటిస్నానం చేస్తూవున్నాను. 14రోజుల ఉపవాసం చేసినప్పుడు రెండుమూడు రోజుల తరువాత దానిని ఆపివేశాను. నీరు రుచించేదికాదు. నీళ్ళు త్రాగితే డోకు వచ్చినట్లుండేది. అందువల్ల నీళ్ళు త్రాగటం తగ్గించాను. దానితో గొంతు ఎండిపోయింది. బలహీనమైపోయాను. చివరిరోజుల్లో మాటకూడా మెల్లగా మాట్లాడవలసి వచ్చింది. కాని రాతపని మాత్రం చివరిరోజువరకు చేస్తువున్నాను. రామాయణాదులు చివరివరకూ వింటున్నాను. అన్ని విషయాల్లోను సలహాలు యిస్తూవున్నాను.