పుట:సత్యశోధన.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

314

గోఖలేగారిని కలుసుకునేందుకై ప్రయాణం


37. గోఖలేగారిని కలుసుకునేందుకై ప్రయాణం

దక్షిణ ఆఫ్రికాకు సంబంధించిన అనేక స్మృతుల్ని వదిలివేయక తప్పడం లేదు. 1914 సత్యాగ్రహ సమరం ఆగిన తరువాత గోఖలేగారి కోరిక ప్రకారం నేను ఇంగ్లాండు వెళ్ళి అక్కడినుండి హిందూదేశం చేరవలసి వుంది. అందువల్ల జూలై మాసంలో కస్తూరిబాయి, కేలన్‌బెక్, నేను ముగ్గురం ఇంగ్లాండుకు బయలుదేరాం. సత్యాగ్రహ సమరం జరిగిన తరువాత నేను రైళ్ళలో మూడో తరగతిలో ప్రయాణం చేయడం ప్రారంభించాను. అందువల్ల ఓడలో కూడా మూడో తరగతి టిక్కెట్లే కొన్నాను. అయితే ఇక్కడి మూడో తరగతికి మనదేశంలో మూడో తరగతికి చాలా తేడా వున్నది. మనదేశంలో కూర్చునేందుకు, పడుకునేందుకు, అతి కష్టంమీద చోటు దొరుకుతుంది. పారిశుధ్యం అను విషయాన్ని గురించి యోచించడం అనవసరం. కాని యిక్కడ మూడో తరగతి యందు చోటు బాగానే దొరుకుతుంది. పారిశుద్ధ్యం కూడా ఎక్కువగా జరుగుతుంది. మరొకరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వుండేందుకై ఒక పాయిఖానా దొడ్డికి తాళంబెట్టి తాళం చెవి మాకు యిచ్చారు. మేము ముగ్గురం పలావు భుజించేవారం కావడం వల్ల మాకు ఎండు ద్రాక్ష, కిస్‌మిస్, తాజా పండ్లు యిమ్మని స్టీమరు కేషియరుకు ఆర్డరు అందింది. సామాన్యంగా మూడో తరగతి ప్రయాణీకులకు పండ్లు కొద్దిగా లభిస్తాయేగాని ఎండు ద్రాక్ష వగైరాలు లభించవు. ఇట్టి సౌకర్యం లభించడం వల్ల మేము ముగ్గురం ఓడమీద 18 రోజులు ఎంతో ప్రశాంతంగా ప్రయాణం చేశాం.

ఈ యాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవలసిన అవసరం వున్నది. మి. కేలన్‌బెక్‌కు దుర్భిణీ యంత్రం అంటే సర్దా. ఆయన దగ్గర ఒకటి రెండు ఖరీదైన దుర్భిణీ యంత్రాలున్నాయి. వాటిని గురించి రోజూ చర్చిస్తూవుండేవారం. ఆదర్శంగా వుండాలని, సాదా జీవితం గడపాలని భావించే మనబోటివారికి అంత ఖరీదైన వస్తువులు తగవని నచ్చచెబుతూ వుండేవాణ్ణి. ఒకరోజున యీ విషయం మీద మా యిద్దరి మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. మేమిద్దరం మా కేబిన్ కిటికీల దగ్గర నిలబడి వున్నాం. “మన యిద్దరి మధ్య తకరారు ఎందుకు? ఈ దుర్భిణీ యంత్రం సముద్రంలో పారేస్తే ఆ ఊసే ఎత్తం కదా!” అని అన్నాను. మి. కేలన్‌బెక్ వెంటనే మనిద్దరి మధ్య పొరపొచ్చాలు కలిగిస్తున్న ఈ వస్తువును పారేయండి అని