పుట:సత్యశోధన.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

310

మంచి చెడుల మిశ్రమం

వ్యవహరించి యుండలేదు. అతడు భోరున ఏడ్చాడు. క్షమించమని వేడుకున్నాడు. రూళ్ల కర్ర తగిలి బాధ కలిగినందున అతడు ఏడ్వలేదు. ఎదిరించ తలుచుకుంటే నన్ను ఎదుర్కోగల శక్తి అతడికి వుంది. అతడి వయస్సు 17 సంవత్సరాలు వుండి వుంటుంది. శరీరం బలంగా కుదిమట్టంగా వుంటుంది. రూళ్ల కర్రతో కొట్టినప్పుడు నేను పడ్డ బాధను అతడు గ్రహించి యుంటాడు. తరువాత అతడు ఎవ్వరినీ వ్యతిరేకించలేదు. కాని రూళ్ల కర్రతో కొట్టినందుకు కలిగిన పశ్చాత్తాపాన్ని ఈనాటి వరకు నేను మరచిపోలేను. నేను అతడిని కొట్టి నా ఆత్మను గాక నా పశుత్వాన్ని ప్రదర్శించానను భయం నాకు కలిగింది.

పిల్లలను కొట్టి వారికి పాఠాలు చెప్పడానికి నేను వ్యతిరేకిని. నా విద్యార్థుల్లో ఒక్కణ్ణి మాత్రమే ఒక్కసారి మాత్రమే కొట్టినట్లు నాకు బాగా గుర్తు. రూళ్ల కర్రతో కొట్టి నేను మంచిపనిచేశానో లేక చెడుపనిచేశానో ఈనాటి వరకు నేను తేల్చుకోలేదు. అయితే ఆ దండన యందుగల ఔచిత్యం విషయమై నాకు సందేహం వున్నది. ఆనాటి దండనకు మూలం కోపం మరియు దండించాలనే కాంక్ష. నాకు కలిగిన దుఃఖం ఆ దండనలో వ్యక్తం అయితే సంతోషించి వుండేవాణ్ణి. ఈ ఘట్టం జరిగాక విద్యార్ధులను దండించే క్రొత్త విధానం నేర్చుకున్నాను. అప్పుడు ఈ క్రొత్తవిధానాన్ని అనుసరించి యుంటే ఏమై యుండేదో చెప్పలేను. ఆవిషయం ఆ యువకుడు అప్పుడే మరచిపోయాడు. అతనిలో పెద్ద మార్పు వచ్చిందని కూడా నేను చెప్పలేను. అయితే ఈ ఘట్టం విద్యార్థుల విషయంలో ఎలా వ్యవహరించాలో నాకు బోధపరిచింది. జాగ్రత్తపడేలా చేసింది. తరువాత కూడా కొందరు యువకులు తప్పులు చేశారు. అయితే వారిని దండనా విధానంతో దండించలేదు. ఈ విధంగా యితరులకు ఆత్మశిక్షణ గరపాలనే ఉద్దేశ్యంతో కృషి చేసిన నేను ఆత్మ సుగుణాన్ని గురించి తెలుసుకోసాగాను. 

35. మంచి చెడుల మిశ్రమం

టాల్‌స్టాయ్ ఆశ్రమంలో మి. కేలన్‌బెక్ మరో సమస్యను నా దృష్టికి తెచ్చారు. వారు చెప్పనంతవరకు ఆ విషయాన్ని గురించి నేను యోచించలేదు. ఆశ్రమంలో గల కొందరు పిల్లలు ఉపద్రవాలు చేసే రకం. చెడ్డవాళ్లు రౌడీలు కూడా వాళ్లతోబాటు నా ముగ్గురు పిల్లలు ఇంకా కొంతమంది పిల్లలు వుండేవారు. అట్టి చెడ్డ పిల్లలతోబాటు మీ పిల్లలు పుండటం సబబా అనే ప్రశ్న మి. కేలన్‌బెక్ వేశారు. ఒకనాడు ఆయన